High Court: హైకోర్టులో ఆసక్తికరమైన కేసు విచారణ జరిగింది. ‘నావల్ల తప్పిదం జరిగింది. దాన్ని కారణంగా చూపుతూ పోలీసులు, అధికారులు నా కుమార్తెను నా నుంచి వేరుచేశారు. బిడ్డను నాకు అప్పగించండి. బాగా చూసుకుంటాను’ అని వేడుకుంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించారు. తల్లి చేసింది తప్పే అయినా... చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, తల్లుల మనస్తత్వంపై కోర్టు సానుకూల వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో ఎన్జీవోలు నిర్వహిస్తున్న అనాథాశ్రమాలు, శిశు సంక్షేమ కేంద్రాల్లో అసౌకర్యాలపైనా దృష్టిసారించింది. వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
తదుపరి విచారణను సెప్టెంబరు 8కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. విజయవాడలో మూడో తరగతి చదువుతున్న బాలిక తమ ఇంటి మేడపై దుస్తులు లేకుండా తిరగడంతో ఆమెను తల్లి బాగా కొట్టగా బిగ్గరగా ఏడ్చింది. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పాపను శిశుసంక్షేమశాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. బాలికను ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ‘చిగురు’ అనే శిశు సంక్షేమ కేంద్రంలో చేర్పించారు. అయితే... తమ బిడ్డను అప్పగించాలని కోరుతూ తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. జరిగిన ఘటనకు పశ్చాత్తాప పడుతున్నామని, బిడ్డను ప్రేమగా చూసుకుంటామని కోర్టుకు విన్నవించారు.
పిల్లలకు తల్లే తొలి దైవం: వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... ‘తల్లి వ్యవహారశైలి ఐపీసీ 323, 324 సెక్షన్ల కిందకు వస్తున్నట్లు కనిపించొచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ తల్లే మొదటి దైవం, గురువు. బాల్యదశలో సరైన మార్గంలో నడిచేలా శిక్షణ ఇస్తుంది. అలాంటి ఆదరణీయ స్వభావముండే తలి.్ల.. నేరమనస్తత్వంతో బిడ్డలకు హాని చేస్తుందని మేం అనుకోవడం లేదు. చిన్నారి పట్ల తల్లి ప్రవర్తన దురదృష్టకరమైంది’ అని ధర్మాసనం పేర్కొంది. ‘బాలికను తల్లిదండ్రులకు అప్పగించాలని అధికారులను ఆదేశిస్తున్నాం. బిడ్డపై ప్రేమానుగారాలు చూపాలని, ఆమె పేరిట 15 రోజుల్లో రూ.50 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని తల్లిదండ్రులకూ స్పష్టంచేస్తున్నాం’ అని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిందే: శిశు సంక్షేమ కేంద్రం ‘చిగురు’లో తగినన్ని సౌకర్యాలు లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసు విచారణ సందర్భంగా... చిన్నారి కాళ్ల మీద పెద్ద నల్లటి మచ్చలను గమనించామంది. దోమలు కుట్టడంతో మచ్చలు వచ్చాయని తమకు చెప్పారని, అయితే అవి ఏవో కీటకాలు కుట్టినట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనాథాశ్రమాలు, శిశు సంక్షేమ కేంద్రాలు, వాటిలోని సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. వాటి నిర్వహణపై ప్రభుత్వం చేసిన చట్టాలనూ కోర్టుకు సమర్పించాలంది.
ఇవీ చదవండి: