ఎలాంటి హామీ అవసరం లేకుండానే మీకు అప్పు కావాలా? ఇంకెందుకు ఆలస్యం మా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని వివరాలివ్వండి... క్షణాల్లో కావాల్సినంత రుణం పొందండి... అంటూ ఆకర్షణీయ ప్రకటనలతో ఆన్‌లైన్ ఆధారిత రుణ యాప్‌లు ఊరిస్తూ ఉచ్చులోకి లాగుతున్నాయి. ఇందులో చిక్కుకుని వేలాది మంది అల్లాడుతున్నారు. వీటి బాధితులు కొందరు నాలుగైదు రోజుల నుంచి విజయవాడ సైబర్ నేరాల పోలీసుస్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
హామీలు అడగకుండానే...
లాక్‌డౌన్‌తో చాలామందికి ఆదాయాలు తగ్గాయి. కొందరు ఉద్యోగాలనూ, ఉపాధినీ కోల్పోయారు. అలాంటి వారు అత్యవసరాలు... ఇంటి ఖర్చుల కోసం తప్పనిసరై యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. హామీ అడగకపోవటంతో విద్యార్థులు, నిరుద్యోగులు మొగ్గు చూపుతున్నారు. తీసుకున్న అప్పు చెల్లింపు ఒక్కగంట ఆలస్యమైనా సరే రుణ గ్రహీతల్ని, వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రుల్ని యాప్‌ల నిర్వాహకులు వేధిస్తూ, బెదిరిస్తూ, తీవ్రక్షోభకు గురి చేస్తున్నారు. విరామమివ్వకుండా నిరంతరం ఫోన్లు చేస్తూ నానా దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో బెదిరిస్తున్నారు. వారికి సంబంధించిన కాంటాక్టు నంబర్లలో ఉండే మహిళలకు ఫోన్లు చేసి... వేధిస్తున్నారు. 'ఈ వ్యక్తి దొంగ' అంటూ వారి ఫొటోలపై ముద్రలు వేసి.. అతనికి తెలిసిన వారందరి వాట్సాప్ నంబర్లకు పంపిస్తున్నారు.
- రుణ యాప్‌లపై క్లిక్ చేసినా... ప్లేస్టోర్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసినా వారి ఉచ్చులో చిక్కుకున్నట్లే.
- అప్పు తీసుకునే వ్యక్తి ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లు, అందులోని చిత్రాలు, దృశ్యాలు సహా ఇతర సమగ్ర సమాచారం, మెమరీ తదితర వివరాలన్నీ యాప్ నిర్వాహకులు పొందేందుకు అనుమతి ఇస్తేనే (యాక్సెస్) రుణం పొందేందుకు వీలవుతుంది. రుణగ్రహీత ఒక్కసారి అనుమతిస్తే అతని ఫోన్ యాప్ నిర్వాహకుల సర్వర్‌కు అనుసంధానమవుతుంది.
- రుణం ఇచ్చేముందు అందులో షరతులు, నిబంధనలు అనే ఒక చిన్న విభాగం ఉంటుంది. ఆ వివరాలను చదవకుండానే చాలామంది అంగీకారం తెలుపుతున్నారు. దీనివల్ల వారం, పది రోజుల వ్యవధిలోనే తీసుకున్న అప్పు కంటే వడ్డీ అధికంగా కట్టాల్సి వస్తోంది.
నా ఫోన్‌కు కొన్ని ఆన్‌లైన్ రుణ యాప్ లింక్‌లు వస్తే క్లిక్ చేశాను. అవతలి వారు ఫోన్ చేసి రుణమిస్తామని చెప్పారు. నాకు అవసరం ఉండటంతో కొన్ని యాప్‌ల నుంచి రూ.60 వేలు అప్పు తీసుకున్నా. వాయిదాలను సకాలంలోనే చెల్లిస్తున్నా. ఈసారి చెల్లింపు ఒకరోజు ఆలస్యమయ్యే సరికి.. బంధువులకు ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది- గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఎదుట కొత్తపేటకు చెందిన ఓ మహిళ ఆవేదన
ఎంబీఏ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆహ్లాద.. ఆన్‌లైన్ రుణ యాప్‌ల ద్వారా రూ.25 వేలు తీసుకున్నారు. ఆ సొమ్ము చెల్లించాలంటూ యాప్‌ల నిర్వాహకుల నుంచి తీవ్ర ఒత్తిడి, వేధింపులు ఎదురవటం, వారు నిరంతరం ఫోన్లు చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖపట్నం గాజువాకలో చోటుచేసుకుందీ ఘటన.
నెల్లూరుకు చెందిన ఓ అధ్యాపకురాలు... ప్రసవ సమయంలో ఖర్చుల కోసం ఓ యాప్ ద్వారా రూ.5 వేల రుణం తీసుకున్నారు. చెల్లింపు ఒకరోజు ఆలస్యం కావటంతో యాప్ ప్రతినిధులు ఆమెను బెదిరించారు. ఆమె సమర్పించిన పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫొటోలపై 'దొంగ' అనే ముద్ర వేసి... వాటిని ఆమె సెల్‌ఫోన్ కాంటాక్టు జాబితాలో ఉన్న నంబర్లన్నింటికీ వాట్సాప్ ద్వారా పంపించారు. ఇప్పుడు ఆమె క్షోభ వర్ణనాతీతం.
బాధితుల్లో మహిళలే అధికం
ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలిచ్చి.. వాటిని వసూలు చేయటానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, సీఐడీ, సైబర్ నేర విభాగాలను ఆదేశించాం. చట్టబద్ధత లేని ఇలాంటి యాప్‌ల నుంచి ప్రజలు అప్పులు తీసుకోవొద్దు. యాప్‌ల ప్రతినిధులు ఎవరైనా వేధిస్తే సమీప పోలీసుస్టేషన్, ఏపీ పోలీసు సేవా యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఆన్‌లైన్ ద్వారా అప్పులిచ్చే సూక్ష్మరుణ యాప్‌ల బాధితుల్లో అధికశాతం మహిళలే ఉంటున్నారు. నొయిడా, దిల్లీ తదితర ప్రాంతాల నుంచి ఈ యాప్‌ల ప్రతినిధులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటి గుట్టు తేల్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం- గౌతమ్ సవాంగ్, డీజీపీ
ఇదీ చదవండి: