నగరం విస్తరించడం వల్ల గూడు కరవైన సర్పాలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. పట్టణాల్లో విషసర్పాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు హైదరాబాద్ నగరానికి చెందిన స్నేక్సొసైటీ సర్వేలో తేలింది. 2020లో ఈ బృందం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,895 పాముల్ని పట్టుకోగా.. వీటిలో దాదాపు 8 వేల దాకా నగరంలో పట్టుకున్నవే. వీటిలో సగం అంటే 4 వేల దాకా విషపూరిత నాగుపాముల్నే పట్టుకున్నట్లు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు.
జూలో చికిత్స..!
నగరంలో స్నేక్ సొసైటీకి రోజుకు 150 నుంచి 200 దాకా ఫోన్‌కాల్స్ వస్తున్నాయని సంస్థ ప్రతినిధి అవినాశ్ వెల్లడించారు. ఫోన్ రాగానే ప్రతినిధులు అక్కడికి చేరుకుని అటవీశాఖ సహకారంతో పాములను పట్టుకుని అడవుల్లో వదిలేస్తున్నారు. గాయపడిన వాటికి ఇక్కడి నెహ్రూ జూ పార్కులో చికిత్స అందించి.. ఇక్కడే పర్యవేక్షణలో పెడుతున్నామని చెబుతున్నారు.
స్థలం లేక జనావాసాల్లోకి..
నగరంలో విషరహిత పాముల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు చెబుతున్నారు ఈ సంస్థ ప్రతినిధులు. ఎక్కడికక్కడ కొండల్ని తొలుస్తూ ఇళ్లను నిర్మిస్తున్నారు. బ్లాస్టింగ్‌లతో విషరహిత సర్పాలుగా పేరొందిన రాకీ పైథాన్, బఫ్ స్ట్రైఫ్డ్ కీల్‌బ్యాక్ తదితర జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్నేక్ సొసైటీ చెబుతోంది.
ప్రధాన నగరంలోని జూబ్లీహిల్స్‌తో పాటు శివార్లలోని గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట, నెక్నాంపూర్ తదితర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో విషసర్పాలైన నాగుపాములు, స్పెక్టకిల్ కోబ్రా, రస్సెల్‌వైపర్, కామన్ కైరాట్, స్కా స్కేల్డ్ వైపర్ వంటి విషసర్పాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం పడేస్తుండటంతో వీటిలో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆయాప్రాంతాల్లో సర్పాల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఇదీ చూడండి: వాయుసేన గణతంత్ర విన్యాసాలకు మహిళ సారథ్యం