ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపులు చేయకుండా బోర్డుల పరిధి ఖరారు చేయవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఖరారు చేయాలని కోరింది. తాజాగా బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. మంత్రులు కూడా ఎవరు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పలేదని సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు..
సాగునీటి విషయంలో రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదన్న సీఎం.. సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉభయసభల్లో పోరాడాలని వారికి సూచించారు. గెజిట్ నోటిఫికేషన్ పై విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ దిశగా ఇప్పటికే అధికారులు, ఇంజినీర్లు, న్యాయనిపుణులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. గెజిట్లో ఉన్న అంశాలు, విభజన చట్టం, అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టాలు, ఒప్పందాలను అధ్యయనం చేస్తున్నారు. చట్టపరమైన అంశాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలతో పాటు భవిష్యతులో వచ్చే సమస్యలు-వాటి పరిష్కారం, తదితర అంశాలు ఇమిడి ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలను అన్ని కోణాల్లో పరిశీలించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.
వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని..
ఇప్పటికే నదీజలాల అంశాలు ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల్లో ఉండడం, కేంద్రం నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాలు పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఓ అభిప్రాయానికి రావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. ఏ దశలోనూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఊరుకునే ప్రసక్తే లేదని.. అన్ని రకాలుగా పోరాటానికి సిద్ధమని నేతలతో ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం... అటు పార్టీ తరపున ఎవరూ కూడా గెజిట్ నోటిఫికేషన్ విషయంలో వ్యాఖ్యలు చేయవద్దని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. గంభీరమైన అంశం అయినందున సమగ్ర అవగాహనతో ఓ అభిప్రాయానికి వచ్చాకే ముఖ్యమంత్రి స్పందిస్తారని ప్రభుత్వ, పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చదవండి:
krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు
cbn on gazette: 'జలశక్తి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం'