లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్ నెలలో విద్యుత్ మీటర్ రీడింగ్ తీయకుండా, గత సగటు ఆధారంగా బిల్లు నిర్ణయించడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో వారు వినియోగించిన దానికంటే తక్కువ బిల్లు వస్తుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ పేర్కొన్నట్టు.. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘కొవిడ్ వల్ల అందరూ ఇళ్లలో ఉండిపోవడంతో ఏప్రిల్‌లో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. గత ఐదేళ్లలో మార్చి, ఏప్రిల్ నెలల విద్యుత్ వాడకం తీరును పరిశీలిస్తే 46:54 నిష్పత్తిలో ఉంది. కానీ మేం ఏప్రిల్ విద్యుత్ వినియోగంలో 4% మార్చిలో చేర్చి 50:50 నిష్పత్తిలో బిల్లు నిర్ణయించాం. దానివల్ల ఏప్రిల్ బిల్లులు తక్కువ శ్లాబ్‌లో పడ్డాయి. కాబట్టి ఏప్రిల్‌లో వినియోగించినదాని కంటే తక్కువ బిల్లులు వచ్చాయి. మార్చి విషయానికి వస్తే... 2019-20 నాటి విద్యుత్ ధరలు, 2018-19 వినియోగం ఆధారంగా నిర్ణయించారు. కాబట్టి మార్చి వినియోగంలో 4% అదనంగా చేర్చినా బిల్లులు పెరగలేదు. వినియోగదారులకు మేలు చేసేలాగే బిల్లులు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ నెల బిల్లుల వివరాల్ని వినియోగదారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు’’ అని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు కూడా మార్చి, ఏప్రిల్ నెలల వాడకాన్ని 61 రోజులకు లెక్కించి రెండు నెలలకు తలో సగం సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి...ఆమె కరోనాను జయించింది.. కానీ..!