మూడు రాజధానుల నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడతుందని హైకోర్టు ముందు శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. రైతులు తమ జీవనాధారమైన భూముల్ని భూసమీకరణలో ఇచ్చారని...,వారి ప్రాథమిక హక్కుల్ని హరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. వ్యాజ్యంలో పూర్తిస్థాయి వాదనల కొనసాగింపునకు విచారణ నేటికి వాయిదా పడింది.
ఆ నిర్ణయం సరికాదు
ఉమ్మడి రాష్ట్ర విభజనకు పార్లమెంటు చట్టం చేసిందని..,ఆ తర్వాతి పరిణామాల్లో ఏపీకి కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయించారని విభజన చట్టం ప్రకారం కేంద్రం ఆర్థిక సాయం చేసిందని శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. రాజధానిని నిర్ణయించిన చోటే కేంద్రం నిధులతో నిర్మించాలని వేరే ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు కుదరదని వాదించారు. కేంద్రానికి భిన్నంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడం సరికాదని అలాంటి విరుద్ధమైన నిర్ణయం సహకార సమాఖ్య విధానం అనిపించుకోదన్నారు. అప్పటి ప్రభుత్వం చట్టసభల్లో చర్చించి అమరావతి ఒక్కటే రాజధానిగా నిర్ణయం తీసుకుందని విభజన చట్టంలోనూ 'ఒక రాజధాని' అనే ఉందని వాదించారు.
ఆ కమిటీకే విలువ, చట్టబద్ధత ఉంటాయి
ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు విభజన చట్టం ఆధారంగా కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని...ఆ కమిటీకే విలువ, చట్టబద్ధత ఉంటాయన్నారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసే అధికారం ఉండదన్నారు. అమరావతి రాజధానిగా ప్రణాళిక సిద్ధమైందని...ప్రజాధనంతో మౌలిక సదుపాయాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వివరించారు. ఈ దశలో రాజధానిని మార్చడం సరికాదని...రాజధానిని మారిస్తే అధికరణ 21, 300ఏ ప్రకారం భూమిలిచ్చిన రైతులు హక్కులు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నారు. రాజధాని అమరావతి ప్రాజెక్టును ఆకస్మాత్తుగా నిలిపివేయడం వల్ల 33 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని శ్యాం దివాన్ వాదనలు వినిపించారు.
ఇదీచదవండి
సీఎం జగన్ ఇప్పటికైనా క్షమాపణ చెబితే బాగుంటుంది: రఘురామకృష్ణరాజు