థర్మల్ విద్యుత్ కేంద్రాలు బూడిద పరిమాణంతో సంబంధం లేకుండా ఎటువంటి బొగ్గును వాడినా.. ఉద్గారాల నియమాలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ మండలుల సూచనలు పాటించని పక్షంలో వాటిపైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఎదుట కేంద్రం ఈ అంశాన్ని సమర్థించుకుంది. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణం.. బొగ్గు మంత్రిత్వశాఖలు సంయుక్తంగా తమ సమాధానాన్ని తెలియపరిచాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు వినియోగించటానికి అటవీ మంత్రిత్వశాఖ ఇస్తున్న అనుమతులను తప్పుపడుతూ ‘సే ఎర్త్’ అనే ప్రభుత్వేతర సంస్థ ఎన్జీటీని ఆశ్రయించింది.
"పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 ప్రకారం థర్మల్ విద్యుత్ కేంద్రాలు పరిమితులకు మించి బూడిద ఉన్న బొగ్గు వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని అటవీ మంత్రిత్వశాఖ తొలుత ఆక్షేపణ తెలిపింది. తర్వాత థర్మల్ కేంద్రాలు నిబంధనలు పాటించేలా చేయటం తన వల్ల కావటం లేదని గత ఏడాది మే నెలాఖరులో కొత్త ఉత్తర్వులిచ్చింది. బొగ్గుగనులకు 500 కి.మీ.ల దూరంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు 34 శాతం బూడిదను మించని బొగ్గు మాత్రమే వినియోగించటం తప్పనిసరి అని 2014 జనవరిలో తాను ఇచ్చిన ఉత్తర్వుల నుంచి తప్పుకొంది"- అని ఆరోపించింది. దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా ఎన్జీటీ కేంద్రంలోని ఆయా మంత్రిత్వ శాఖలను కోరింది.
సాంకేతిక అధ్యయనం తర్వాతే అనుమతులు
ఆయా భాగస్వామ్య పక్షాల వినతులు, సాంకేతిక అధ్యయనాల తర్వాతే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కువ బూడిద ఉన్న బొగ్గును వినియోగించుకోటానికి తాము అనుమతులు ఇచ్చామని కేంద్రం చెప్పింది. బూడిద వినియోగం, ఉద్గారాల విడుదలకు సంబంధించి తాము వెలువరించిన నిబంధనలు పవర్‌ప్లాంట్లకు వర్తిస్తాయని తెలిపింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ సంబంధిత ఎన్జీవో ఫిర్యాదును తోసిపుచ్చింది.
ఇవీ చూడండి: