లాక్‌డౌన్‌తో విద్యుత్తు వినియోగం 20 శాతం, రెవెన్యూ వసూళ్లు సుమారు 80 శాతం తగ్గటంతో రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ప్రత్యేక సహకారం అందించాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యుత్తు శాఖ తెలిపింది. కరోనాతో రాష్ట్ర విద్యుత్తు రంగంలో ఏర్పడిన పరిస్థితులను అంచనా వేయటానికి కేంద్ర విద్యుత్తు శాఖ సంయుక్త కార్యదర్శి అనిరుధ్‌కుమార్‌ను ప్రత్యేక అధికారిగా కేంద్రం నియమించిందని వెల్లడించింది.
కేంద్రానికి రాష్ట్రం పంపిన సమాచారం..
* విద్యుత్‌కు డిమాండ్ తగ్గడంతో రూ.2,500 కోట్ల మేర రెవెన్యూ వసూళ్లు క్షీణించే అవకాశం ఉంది. మార్చిలో 36.73 శాతం తగ్గాయి.
* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్తు బిల్లులు రూ.188 కోట్లు పూర్తిగా మాఫీకి ప్రభుత్వం అంగీకరించింది.
* విద్యుదుత్పత్తి సంస్థలకు స్థిరఛార్జీలుగా రూ.7,500 కోట్లు, పీజీసీఐఎల్‌కు రూ.1,450 కోట్లు ఏటా చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్తు వినియోగదారుల నుంచి ఏటా డిస్కంలు కనీస విద్యుత్తు డిమాండు ఛార్జీల కింద రూ.6,500 కోట్లే వస్తోంది.
* వివిధ విద్యుత్తు సంస్థలకు 31 మార్చి 2020 నాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.33,209 కోట్లకు చేరాయి. నిర్వహణ మూలధనం కింద రూ.17,087 కోట్లు, విద్యుత్తు కొనుగోలు బిల్లుల కింద రూ.16,122 కోట్లు డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఇచ్చే రాయితీ రూ.13,244 కోట్లు పోను డిస్కంలు రూ.19,965 కోట్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి...వలస కూలీకి సరిహద్దు కష్టం