రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా నేతల వ్యాఖ్యలపై.. వైకాపా శ్రేణులు భగ్గుమన్నాయి. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి దిగాయి. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తెదేపా కార్యాలయాలపై దాడులకు దిగి.. విధ్వంసం సృష్టించారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలో వైకాపా శ్రేణులు దాడికి పాల్పడుతున్నా.. ఆయన స్పందిచలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారి జాతి నిర్వీర్యమవుతుంటే ప్రశ్నించినవారిపై ఈ దాడులేంటని మండిపడ్డారు. వైకాపా దాడులకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్(tpd call state bandh)కు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రజలు బంద్(chandrababu call state bandh)కు సహకరించాలని కోరారు.
కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడుల విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిణామాలు వివరించారు. కేంద్ర బలగాల సాయం కోరారు. బలగాలు పంపేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెదేపా నేతలు తెలిపారు.
పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి పార్టీ శ్రేణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వైకాపా శ్రేణుల దాడిలో దెబ్బతిన్న కార్యాలయ సామగ్రి, ధ్వంసమైన నేతల వాహనాలను పరిశీలించారు.
సీఎం, డీజీపీ కలిసే చేయించారు: చంద్రబాబు
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దాడి దారుణమన్నారు. దాడుల విషయంలో పోలీసులు, సీఎం లాలూచీపడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రమేయంపైనే దాడులు జరిగాయన్న ఆయన.. పార్టీ కార్యాలయంపై దాడిని జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీ కార్యాలయం.. రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిదని చంద్రబాబు.. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్నా పోలీసులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. డీజీపీ కార్యాలయం పక్కనే దాడి జరిగితే నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రణాళిక ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగపడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసే ఈ దాడి చేయించారన్నారు.
ఇదీ చదవండి
తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులు.. రేపు రాష్ట్ర బంద్‌కు తెదేపా పిలుపు