ఈ వృద్ధురాలి స్వస్థలం ఏపీలోని కడప జిల్లా కమలాపురం దగ్గర మారుమూల పల్లె. అనారోగ్యంతో బాధపడుతోంది. స్థానికంగా వైద్యుల వల్ల ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్‌లోని నిపుణులకు చూపించాలని వైద్యులు సూచించారు. దీంతో ఓ ప్రైవేటు క్లినిక్ సాయంతో టెలీమెడిసిన్ ద్వారా హైదరాబాద్‌లోని వైద్య నిపుణుడిని సంప్రదించి మందులు తీసుకుంటోంది.
ఈమె పేరు కళావతి. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలోని మారుమూల పల్లె గుడిగండ్ల. ఈ ఊరిలో ఎవరికి చిన్న జ్వరం వచ్చినా ఆర్‌ఎంపీ వైద్యుడే దిక్కు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థతో కలిసి ప్రభుత్వం కల్పించిన టెలీమెడిసిన్ ద్వారా ఈమె నేరుగా తన ఊరిలో నుంచే వైద్యుని సూచనలు, సలహాలు తీసుకుంటోంది. ఏ మందులు వాడాలో కూడా వీడియో కన్సల్టెన్సీలోనే వైద్యులు చెబుతుంటారు.
కరోనా తర్వాత అన్ని రంగాల్లోనూ ఆన్‌లైన్ సేవలు పెరిగాయి. ఇంటి నుంచే పని.. సమావేశాలు, చదువులతో పాటు ముఖ్యంగా వైద్య సేవలు కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. టెలీమెడిసిన్, టెలీహెల్త్ కారణంగా ఆసుపత్రి గడప తొక్కకుండానే వైద్య సేవలు పొందే వీలు కలుగుతోంది. డాక్టర్ ఎక్కడో మహా నగరంలో పెద్దాసుపత్రిలో ఉంటాడు. రోగి ఏ మారుమూల పల్లెలోనో ఉండగా ఆన్‌లైన్ ద్వారా మాట్లాడి సూచనలు, సలహాలు మాత్రమే కాదు.. అవసరమైతే మందులు కూడా రాసి ఇస్తాడు అంతే! ప్రస్తుతం అన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు సంస్థలు...ప్రభుత్వ ఆసుపత్రులు సైతం వీటికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులైతే ప్రత్యేకంగా టెలీహెల్త్ కోసం క్లినిక్‌లు తెరుస్తున్నాయి.
పల్లెలకు పెద్ద దిక్కు..
తెలుగు రాష్ట్రాల్లో 50 వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికీ రహదారుల సదుపాయం లేనివి ఎన్నో. అత్యవసర పరిస్థితుల్లో అక్కడ నుంచి పెద్దాసుపత్రులకు వెళ్లాలంటే పుణ్యకాలం గడిచిపోతోంది. ఈ క్రమంలో టెలీమెడిసిన్ సేవలు సంజీవనిలా మారుతున్నాయి. ఇలాంటిచోట్ల అంకుర సంస్థలు స్థానిక వైద్యులతో అవగాహన పెంచుకొని ఈ-కన్సల్టెన్సీ ద్వారా సేవలు అందిస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌లతో అవగాహన కుదుర్చుకొంటున్నాయి. వారే ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకుంటున్నారు. ఆసుపత్రుల ఖర్చుతో పోల్చితే ఇది చాలా తక్కువగా ఉండటంతో రోగులు సైతం మొగ్గుచూపుతున్నారు. అవసరమైన టెస్టులు బయట చేయించుకొని ఆ రిపోర్టులను ఆన్‌లైన్‌లోనే వైద్యులకు పంపుతున్నారు. వైద్యులు ఔషధ వివరాలు ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేస్తున్నారు. తప్పనిసరైన పరిస్థితిలో మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
నిపుణులు లేని చోట..
చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నా నిపుణుల కొరత వేధిస్తోంది. నిపుణులు ఎక్కువగా మహానగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమవుతున్నారు. అత్యవసర సమయాల్లో వారి సలహాలు అవసరమైనప్పుడు టెలీమెడిసిన్ చాలా ఉపయోగపడుతోంది. చిన్న నగరాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో టెలీహెల్త్ ద్వారా పెద్దాసుపత్రుల నుంచి వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలతో శస్త్రచికిత్సల సైతం నిర్వహిస్తున్నారు.
కార్పొరేట్ సేవలు..
అపోలో ఆసుపత్రి 2000 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ (ఇస్రో) సాంకేతిక సహకారం అందించింది. ప్రస్తుతం అపోలో దేశవ్యాప్తంగా పీపీపీ భాగస్వామ్యంలో 700 హెల్త్‌కేర్ సెంటర్ల ద్వారా టెలీమెడిసిన్ సేవలు అందిస్తోంది. ఏపీలో 195 డిజిటల్ ప్రాథమిక వైద్య కేంద్రాలను నిర్వహిస్తోంది. తెలంగాణలో కూడా 400 మీసేవా కేంద్రాల ద్వారా ఈ సేవలు అందించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
అంకుర సంస్థలు..
ఏపీ, తెలంగాణలో పలు కార్పొరేట్ ఆసుపత్రులు, అంకుర సంస్థలు ప్రభుత్వాలతో అవగాహనతో సేవలు కొనసాగిస్తున్నాయి. టీ-కన్సల్ట్ అనే అంకుర సంస్థ తెలంగాణలో 33 జిల్లాల్లో, ఏపీలోని గుంటూరులో పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టెలిమెడిసిన్ సేవలు కల్పిస్తోంది. ఇందులో దాదాపు 500 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు భాగస్వాములై ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రి టాటా ట్రస్టు సహకారంతో జిల్లాల్లోని పేద రోగులకు టెలీ మెడిసిన్ సౌకర్యం అందిస్తోంది.
ఇవీ ప్రయోజనాలు..
* పల్లెలతోపాటు ఎక్కడి నుంచైనా సేవలు పొందే వీలు
* ఆసుపత్రుల్లో చేరకుండానే చికిత్సలు
* అత్యవసర పరిస్థితుల్లో నిపుణుల సూచనలు, సలహాలు
* ఆసుపత్రుల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ
* రవాణా, ఆసుపత్రి ఖర్చులూ మిగులు
ఈ-కన్సల్టెన్సీలకు ఆదరణ పెరిగింది
రానున్న రోజుల్లో టెలీమెడిసిన్, టెలీహెల్త్ సేవలకు మరింత ఆదరణ పెరుగుతుంది. 2020-25లో ఈ మార్కెట్ 31 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. అపోలో ఆసుపత్రుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా టెలీమెడిసిన్ కేంద్రాలను తీసుకొస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. మున్ముందు మరింత విస్తరిస్తున్నాం. చేతిలో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు...నేరుగా ఈ సేవలు పొందే వీలు ఉంది. ఆసుపత్రుల ఖర్చుతో పోల్చితే చాలా తక్కువే.
- సంగీతారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో ఆసుపత్రుల గ్రూపు
ప్రయోజనాలు ఎన్నో..
టెలీమెడిసిన్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణులైన వైద్యులు అన్ని చోట్ల అందుబాటులో ఉండరు. ఈ సమయంలో ఈ-కన్సల్టెన్సీల ద్వారా నిపుణులను నేరుగా సంప్రదించే వీలు ఉంటుంది. కిమ్స్ ద్వారా ప్రత్యేక యాప్‌తో సేవలు ప్రవేశపెట్టాం. వేగవంతమైన డేటా.. ఇతర సాంకేతిక సహకారం పకడ్బందీగా ఉండాలి. అప్పుడే ఇలాంటి సేవల్లో నాణ్యత పెరుగుతుంది.
- డాక్టర్ బి.భాస్కర్‌రావు, సీఈవో, కిమ్స్ ఆసుపత్రులు
జిల్లా ఆసుపత్రులతో అనుసంధానించే యోచన
నిమ్స్ ఆధ్వర్యంలో పదేళ్లుగా టెలీ రేడియాలజీ సేవలు అందిస్తున్నాం. సింగరేణి కాలరీస్‌తో ఒప్పందం ఉంది. ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎమ్మారైలను ఆన్‌లైన్‌లో తెప్పించుకొని పరిశీలిస్తున్నాం. త్వరలో జిల్లా ఆసుపత్రులతో నిమ్స్‌ను అనుసంధానించే ఆలోచన ఉంది. డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్, నిమ్స్
రోగుల సమాచారానికి భద్రత ఉండాలి
ఇటీవల టెలీమెడిసిన్‌కు బాగా ఆదరణ పెరిగింది. అయితే రోగులు, వైద్యులతో పంచుకునే సమాచారం భద్రతపై సందేహాలు ఉన్నాయి. అమెరికా తరహాలో పకడ్బందీ వ్యవస్థ అవసరం. కొన్ని యాప్‌ల ద్వారా పంచుకునే సమాచారం తస్కరించే ప్రమాదం ఉంది. ప్యానల్ ఇనిస్టిట్యూట్స్ నుంచి సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికేషన్ ఉన్న సంస్థలు అందించే సేవలను ఎంచుకోవడం కొంత ఉత్తమం. - సందీప్ మక్తాల, ఛైర్మన్, టీ-కన్సల్ట్
ఇదీ చదవండీ.. చంటిబిడ్డతో వచ్చి.. నామినేషన్ దాఖలు చేసి..