తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ రెవెన్యూ కార్యాలయం ఎదుట తమకు కొందమంది వ్యక్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామంలోని సర్వే నెంబర్లలోని 415, 416, 424 తమకు సంబంధించిన భూమిని, కొందరు అక్రమార్కులు ఫోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అధికారులతో కుమ్మక్కై పాస్‌బుక్‌లు తయారు చేసుకున్నారని వాపోయారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగితే తాము అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా ఎలాంటి న్యాయం జరగలేదని వారు ఆరోపించారు.
తాము ఫిర్యాదు చేసి 4 సంవత్సరాలు దాటినా సంబంధింత అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన తమ ఆస్తిని న్యాయంగా తమకు అప్పగించాలని లేకుంటే.. ఆత్మహత్య చేసుకుంటామని బరిగే కిష్టయ్య, పండుగ సుశీల, మల్లెబోయిన నర్సమ్మ, కందుకూరి పోసాని తహసీల్దార్ కార్యలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. దానితో రెవెన్యూ కార్యాలయం ఎదుట కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గొడవను సద్దుమనిగించారు. బాధితులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇవీ చూడండి: