మాఘమాసంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క- సారలమ్మ జాతరకు మేడారం సిద్ధమైంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరకు... కోటి మందికిపైగానే భక్తులు వస్తారు. పూర్తిగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం విగ్రహాలు కానీ ప్రతిరూపాలు కానీ లేకుండా... 4 రోజుల పాటు కోలాహలంగా వనంలో జరిగే సంబురమిది.
రాత్రికి గద్దెల వద్దకు..
ఆదివాసీ జాతరలో తొలి రోజు... పూజారులు వెంటరాగా.. డప్పు శబ్దాలు.. డోలు వాద్యాల నడుమ... సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వేంచేయనున్నారు. ఇందుకోసం.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి.. బయలుదేరిన పగిడిద్దరాజు రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేసి.. రాత్రికి గద్దెల వద్దకు చేరుకుంటారు.
కన్నేపల్లి నుంచి సారలమ్మ..
ఇదే సమయంలో.. కన్నెపల్లి నుంచి సారలమ్మ.. ఏటూరునాగారం మండలం.. కొండాయ్ నుంచి గోవిందరాజులను కూడా తీసుకువచ్చి.. గద్దెలపైకి తీసుకురానున్నారు. ఈ ప్రక్రియతో జాతర లాంఛనంగా ప్రారంభమైనట్లవుతుంది. వేర్వేరు గ్రామాల నుంచి వచ్చి.. ముందుగా సమ్మక్క పూజా మందిరం దగ్గర దేవతలంతా కలుసుకుంటారు. సమ్మక్క అనుమతి పొందిన తరువాతే.. ఈ దేవతలంతా.. గద్దెలపైకి చేరుకుంటారు.
జనసందోహం..
జాతరను పురస్కరించుకుని మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. జంపన్న వాగు వద్ద భక్తుల సందడి... రోజు రోజుకీ పెరుగుతోంది. వంతెనకు ఇరువైపులా.. జన సందోహం.. కనపడుతోంది. పుణ్యస్నానాలు ఆచరించి.. గద్దెల వద్దకు బయలుదేరుతున్నారు.
విస్తృత ఏర్పాట్లు..
జాతర జరిగే 4 రోజులు.. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల ఏడో తేదీన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు వేర్వేరుగా... అమ్మవార్లను దర్శించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఏసీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్.. నోడల్ అధికారి గౌతమ్ హెలికాఫ్టర్‌లో పర్యటించి మేడారం పరిసరాలను పరిశీలించారు. రూ. 75 కోట్లతో భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
7 లేదా 8న ఛత్తీస్‌గఢ్ సీఎం రాక..
ఈనెల 7 లేదా 8న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ జాతరకు రానున్నట్లు సమాచారం. గత జాతరకు అప్పటి ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ మేడారం వచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మేడారం వచ్చే అవకాశం ఉంది.
వచ్చే నాలుగు రోజులు కీలకం..
అదనపు స్నాన ఘట్టాలను తాత్కాలిక మరుగుదొడ్లు, అంతర్గత రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్, వైద్యం, తాగునీరు సరఫరా మొదలైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అధికారులతో జిల్లా కలెక్టర్ పలుమార్లు సమీక్షించారు. వచ్చే 4 రోజులు కీలకమని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలసత్వం వహించే అధికారులపైన శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం