ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. 70 శాతం సిలబస్ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(TS Inter Exams 2021 TS) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో నమూనా ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. వెబ్‌సైట్‌లో మెటీరియల్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల కెరీర్, ప్రయోజనం కోసమే పరీక్షలు జరుపుతున్నట్లు ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈనెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(TS Inter Exams 2021 TS) జరగనున్నాయి.
అందుకే ఈ పరీక్షలు
కరోనా పరిస్థితుల(corona effect on education news) కారణంగా గత ఏడాది 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 70 శాతం సిలబస్ ఆధారంగానే పరీక్షలు ఉండేలా చూడాలని సూచిస్తూ కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. గత మే నెలలో జరగాల్సిన ద్వితీయ ఇంటర్ (TS Inter Second Year) పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలోనూ వేసి ధ్రువపత్రాలు ఇచ్చింది. ఇంటర్ ప్రథమ సంపత్సర విద్యార్థులను మాత్రం పరీక్షలు లేకుండానే రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అనుకూల పరిస్థితుల్లో పరీక్షలు జరుపుతామని ఆనాడు పేర్కొంది. విద్యార్థులు మాత్రం ప్రమోట్ అంటే 35 శాతం కనీస మార్కులతో పాసైనట్లేననుకున్నారు. ఒకవేళ భవిష్యత్తులో పరీక్షలు జరిపినా ఇష్టం లేకుంటే రాయాల్సిన అవసరం లేదని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు (Inter Board) కాలపట్టిక ప్రకటించింది.
పది సిలబస్‌లోనూ కుదింపు
పదో తరగతిలో గతంలో ఉన్న 11 పరీక్షల(ssc exams)ను ప్రభుత్వం ఆరుకు కుదించింది. ద్వితీయ భాష మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు ఇంతకు ముందు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో పరీక్షలో 40 మార్కులు ఉంటున్నాయి. ఈ ఏడాది ప్రథమ భాష, ద్వితీయ భాష, ఆంగ్లం, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు ఇవ్వాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. పరీక్ష సమయాన్ని మరో అరగంట పొడిగించారు. ఇంతకు ముందు 2 గంటల 45 నిమిషాల పాటు పరీక్ష ఉండగా.. ఈ ఏడాది 3 గంటల 15 నిమిషాల పాటు పరీక్ష సమయం ఉంటుంది. సైన్సు పరీక్షలో విద్యార్థులకు రెండు సమాధాన పత్రాలు ఇస్తారు. ప్రశ్నపత్రం పార్ట్ ఏలోని భౌతిక శాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు ఒకదానిలో, పార్ట్ బీలోని జీవశాస్త్రం సమాధానాలు మరో దానిలో రాయాలి. మార్కుల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఎఫ్ఏ పరీక్షలకు 20, బోర్డు పరీక్షకు 80 మార్కులు యథాతథంగా ఉంటాయని తెలిపింది.
70శాతం సిలబస్సే
సిలబస్ 70 శాతం తగ్గిస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ... చాలా విద్యా సంస్థల్లో ఇప్పటికీ విద్యార్థుల సంఖ్య యాభై శాతానికి మించడం లేదు. మరోవైపు గురుకుల పాఠశాలలు(residential schools) ఇంకా తెరుచుకోలేదు. పదో తరగతికి ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రీఫైనల్ పూర్తి చేయనున్నట్లు పాఠశాల విద్యా శాఖ క్యాలెండరులో ప్రకటించింది. మార్చి, ఏప్రిల్ నెలలో వార్షిక పరీక్ష జరపాలని నిర్ణయించిన విద్యాశాఖ.. త్వరలో పూర్తి షెడ్యూలును ఖరారు చేయనుంది.
ఇదీ చదవండి: