Telangana Gurukul Teachers: తెలంగాణలోని గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ, ఉద్యోగులు కొన్ని పీఆర్‌సీలుగా వేతన వ్యత్యాస సవరణ కోసం ఎదురు చూస్తున్నారు. అది జరగకపోవడంతో గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల కన్నా ఎక్కువగా వేతనం ఉంటే ఇప్పుడు వారితో సమానమైంది. మరోపక్క గురుకుల సొసైటీల నియామక విధానం, నిబంధనలు ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని పోస్టుల్లోనూ సొసైటీల మధ్య వేతన స్కేళ్లు వేరుగా ఉండటంతో గురుకులాల సొసైటీల ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 2005 పీఆర్‌సీ వరకు అమలైన నిబంధనల మేరకు ప్రభుత్వ టీచర్ల కన్నా వేతన స్కేళ్లు ఎక్కువగా ఉండాలని, గురుకుల సొసైటీల్లో అందరికీ ఏకరూప వేతనాలు అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బోధన, గురుకుల నిర్వహణ..
Telangana Gurukul Teachers Salary : గురుకుల ఉపాధ్యాయులు బోధనతో పాటు గురుకుల నిర్వహణ బాధ్యతలు చూడాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధనతో పాటు ట్యూషన్లు, మెస్ నిర్వహణ, వసతి గృహ విద్యార్థుల సంక్షేమం నిర్వహించాలి. ప్రభుత్వ టీచర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలల్లో పనిచేస్తే.. గురుకుల ఉపాధ్యాయులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి. దీంతో గురుకుల సిబ్బందికి పాత పీఆర్‌సీల్లో వేతన స్కేళ్లు ఎక్కువగా నిర్ణయించేవారు. గత మూడు వేతన సవరణల్లో వేతన వ్యత్యాసం తొలగిపోయి, పేస్కేళ్లు సమానమయ్యాయి. ఈ నేపథ్యంలో బోధనతో పాటు విద్యార్థుల సంక్షేమం, వసతి నిర్వహణ తదితర అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందున గతంలో మాదిరి ఎక్కువ వేతన స్కేలు అమలు చేయాలని కోరుతున్నారు.
పనివిధానం ఒకటే.. కానీ..
Telangana Gurukul Teachers Demands Salary Hike : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల్లో పనివిధానం ఒకేలా ఉంటుంది. కానీ వీరికి వేతన స్కేళ్లలో సొసైటీల మధ్య వ్యత్యాసం నెలకొంది. పాఠశాలవిద్య పరిధిలోని సాధారణ సొసైటీ జూనియర్ లెక్చరర్‌కు వేతన స్కేలు రూ.54,220-1,33,630గా ఉంటే, ఎస్సీ గురుకుల సొసైటీలో మాత్రం రూ.51,370-1,27,310గా నిర్ణయించడంపై ఎస్సీ గురుకుల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ వేతనాలు సవరించాలని ఆ సొసైటీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.బాలస్వామి, కీర్తిరవి డిమాండ్ చేశారు. 2005 పీఆర్‌సీ వరకు పాఠశాల విద్య స్కూల్ అసిస్టెంట్ కన్నా గురుకుల టీజీటీకి రూ.1185 మూలవేతనం ఎక్కువ ఉండేది. కానీ ఆ తరువాత నుంచి స్కూల్ అసిస్టెంట్‌తో సమానంగా మారింది. ఇదే తరహాలో పాఠశాల విద్య ప్రధానోపాధ్యాయుడు - పీజీటీ, జూనియర్ లెక్చరర్ల స్కేళ్లు ఒకేలా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. గురుకుల సిబ్బందికి వేతన వ్యత్యాస సవరణ ఉండాలని గురుకుల ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల కన్నా గురుకుల ఉపాధ్యాయులకు 2005 వేతనసవరణ వరకు రెండు, మూడు ఇంక్రిమెంట్లు కలిపి అధికంగా వేతనస్కేళ్లు ఖరారయ్యేవి. కానీ 2010 నుంచి వేతన స్కేళ్లు సాధారణ ప్రభుత్వ ఉద్యోగ టీచర్లతో సమానంగా మారాయి. దీంతో గురుకుల ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.