కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్ బోర్డు ఛైర్మన్‌కు పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విషయంలో లేఖ రాశారు. ఏపీ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. 880 అడుగులపైన నీరు ఉన్నప్పుడూ ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని లేఖలో వివరించారు. ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్‌లో చేర్చాలని ఈఎన్‌సీ లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులను గెజిట్‌లో రెండో షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు.
పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా అధిక జలాలు తరలిస్తున్నారని.. 880 అడుగుల పైనుంచే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకోవాలన్నారు. 11,150 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసేందుకే ప్రాజెక్టు డిజైన్ చేశారన్నారు. శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20 వేల క్యూసెక్కులకు పెంచారని తెలిపారు. వరద సమయాల్లో జులై-అక్టోబర్ మధ్య మాత్రమే నీరు వదలాలని పేర్కొన్నారు. 34 టీఎంసీలకు మించి తీసుకోవడానికి జలసంఘం అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శ్రీశైలం నుంచి నీటి విడుదలను వెంటనే ఆపేయాలని.. పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌ఎంసీని అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొనాలని బోర్డును కోరారు.
ఇదీ చదవండి:
HIGH COURT: బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేం: హైకోర్టు