తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులపై విద్యా శాఖ విధివిధానాలను ప్రకటించింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి.. ఎన్సీఈఆర్టీ (NCERT) రూపొందించిన ప్రజ్ఞత మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ పాఠాలను బోధించాలని స్పష్టం చేసింది.
వారికి గరిష్ఠంగా 45 నిమిషాలే..
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు రోజుకు గరిష్ఠంగా 45 నిమిషాల పాటు.. వారంలో మూడు రోజులు మాత్రమే ఆన్‌లైన్ పాఠాలను బోధించాలని పేర్కొంది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు వారంలో ఐదు రోజులు మాత్రమే ఆన్‌లైన్ పాఠాలు ఉండాలని పాఠశాలలకు స్పష్టం చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో తరగతి అరగంట లేదా 45 నిమిషాలకు మించకుండా.. రోజుకు రెండు తరగతులు మాత్రమే నిర్వహించాలని తెలిపింది. ఒక్కో తరగతి అరగంట లేదా 45 నిమిషాలకు మించకుండా.. ఆరు నుంచి 8వ తరగతి వరకు... రోజుకు మూడు తరగతులు.. 9, 10 తరగతులకు రోజుకు నాలుగు తరగతులు మాత్రమే బోధించాలని విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు.
నెలరోజులు బ్రిడ్జి కోర్సు..
విద్యార్థులను మళ్లీ గాడిన పెట్టేందుకు ఈ నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో బ్రిడ్జి కోర్సు బోధిస్తున్నట్లు విద్యా శాఖ తెలిపింది. రోజుకు 50 శాతం ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీవీలు లేని విద్యార్థుల కోసం తోటివారు, పంచాయతీ సహకారం తీసుకోవాలని తెలిపింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చే యువతను గుర్తించి వారి సేవలు వినియోగించుకోవాలని విద్యా శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
వారితో జాగ్రత్త..
పాఠ్యపుస్తకాలతో పాటు ఎన్సీఈఆర్టీ ప్రత్యేకంగా రూపొందించిన వర్క్‌షీట్లు విద్యార్థులకు చేరేలా ఉపాధ్యాయలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. టీ- శాట్, దూర్‌దర్శన్ ప్రసారాలు జరిగేలా డీఈవో, ఎంఈవోలు చర్యలు తీసుకోవాలని.. కేబుల్ ఆపరేటర్లతో చర్చించాలని తెలిపారు. విద్యుత్ సరఫరా ఉండేలా సంబంధిత అధికారులను కోరాలన్నారు. టీ-శాట్, దూర్‌దర్శన్ ప్రసారాల షెడ్యూలును వీలైనంత ముందుగా తల్లిదండ్రులకు పంపించాలన్నారు. విద్యార్థులకు టీవీ పాఠాల్లో అనుమానాలు వస్తే సామాజిక మాధ్యమాల ద్వారా నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ పాఠాలకు తల్లిదండ్రులూ సహకరించాలని.. అదే సమయంలో సైబర్ జాగ్రత్తలు తీసుకోవాలని సందీప్ కుమార్ సుల్తానియా కోరారు. ఆన్‌లైన్ తరగతుల సమయంలో విద్యార్థుల పక్కన తల్లిదండ్రులు ఉండాలని సూచించారు.
కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రవేశాలు చేపట్టవచ్చునని సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు. బడులకు దూరంగా ఉన్న విద్యార్థులు, బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్చించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రవేశాల ప్రక్రియ కోసం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఇదీచూడండి: జలుబుతో ముగ్గురు చిన్నారులు మృతి- మూడో వేవ్ సంకేతమా?