Telangana cm kcr yadadri visit: యాదాద్రి నారసింహుని దివ్యాలయ ఉద్ఘాటనకు రోజులు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పనుల పరిశీలనకు వెళ్లనున్నారు. 2014 అక్టోబర్ 17న తెలంగాణ సీఎంగా తొలిసారిగా కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. అప్పటి నుంచి 16 సార్లు యాదాద్రిని సందర్శించారు. నేడు 17వసారి సీఎం కేసీఆర్ నారసింహుని సన్నిధికి వెళ్లనున్నారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న యాదాద్రి పనులను పరిశీలించనున్నారు.
యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా.. చేపట్టిన వివిధ పనులు తుదిరూపునకు వచ్చాయి. ప్రధాన రాజగోపురాలు, జీయర్ స్వామి నేతృత్వంలో స్వర్ణ కలశాల స్థాపనకు పరంజాను ఏర్పాటు చేస్తున్నారు. చెన్నైకు చెందిన నిపుణులతో ఏర్పాటవుతున్న ఈ పరంజా పటిష్టతను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవలే పరిశీలించారు.
ఆలయంలో పసిడి వర్ణంలో ఉన్న క్యూలైన్లు బిగింపు పూర్తి కావొచ్చింది. లైటింగ్ పనులు పూర్తిచేసి ట్రయన్ రన్ నిర్వహిస్తున్నారు. కొండపైన ఉత్తరదిశలో రక్షణగోడ, బస్బే, స్వాగతతోరణ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని యాడా చెబుతోంది. రెండో కనుమదారి అనుసంధాన నిర్మాణం తుది దశకు చేరింది. పుణ్య స్నానాల కోసం లక్ష్మి పుష్కరిణి, కల్యాణకట్ట, తలనీలాల సమర్పణకు కల్యాణకట్ట నిర్మాణాలు పూర్తయ్యాయి. నేటి పర్యటనలో తుది దశకుచేరిన పనులను కేసీఆర్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. కొండ కింద సేకరించిన 75 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తారు.
ఇదీచూడండి: JAGAN TOUR: నేడు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్