తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర మంత్రివర్గం శుభవార్త అందించింది. అన్ని రకాల ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణపై శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది సహా పెన్షనర్లు మొత్తం 9,21,037 మందికి 30 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తూ సీఎం చేసిన ప్రకటనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
కొత్త వేతన సవరణ అమలు తేదీలకు సంబంధించి కూడా స్పష్టతనిచ్చింది. పెంచిన పీఆర్సీని జూన్ నెల నుంచి అమలు చేసి.. వేతనాలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్‌ను 2018 జులై ఒకటి నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 2020 ఏప్రిల్ ఒకటి నుంచి, క్యాష్ బెనిఫిట్‌ను 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించిన కేబినెట్.. సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
పెన్షనర్లకు 2020 ఏప్రిల్ నుంచి 2021 మే నెలాఖరు వరకు చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఒప్పంద ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ మీద పరిమితిని కూడా తొలగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.