రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పటం విడ్డూరంగా ఉందని తెదేపా సీనియర్ నేత చినరాజప్ప మండిపడ్డారు. కార్యాలయాలు మార్చడం వికేంద్రీకరణ కాదన్న ఆయన... వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయించాలని తెలిపారు. సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న బిల్లులను గవర్నర్‌కు ఏ విధంగా పంపుతారని.. ఇది కోర్టు ధిక్కరణ కాదా అని ప్రశ్నించారు.
కరోనా వ్యాప్తి నివారణపై కాకుండా అమరావతిపై ఈ సమయంలో ఎందుకు పాకులాడుతున్నారని చినరాజప్ప నిలదీశారు. విశాఖలో భూములు కాజేసేందుకే వైకాపా కుట్రలు పన్నుతుందని ఆయన ఆరోపించారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభిప్రాయాలకు విరుద్ధంగా రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు కుట్ర పన్నారని... ఇది ప్రజాభిప్రాయ ధిక్కరణ అని స్పష్టం చేశారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తానని చెప్పిన సీఎం జగన్ సొంత సామాజికవర్గానికే సలహాదారుల పదవులు కట్టబెట్టి అభివృద్ధి వికేంద్రీకరణను కాలరాశారని చినరాజప్ప దుయ్యబట్టారు.
ఇదీ చూడండి..
గవర్నర్‌కు రాసిన లేఖలో చంద్రబాబు చెప్పినవన్నీఅబద్ధాలే: బొత్స