జగన్ (జె) బ్రాండ్లు పోవాలి.. సీఎం జగన్ దిగిపోవాలంటూ తెదేపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. జె బ్రాండ్లతో ఏడాదికి రూ.6వేల కోట్ల లెక్కన ఐదేళ్లలో రూ.30వేల కోట్లు దోచుకోనున్నారని విమర్శించారు. మద్య నిషేధమని చెప్పిన జగన్.. సొంత బ్రాండ్ల మద్యం, కల్తీ సారా ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతల అండదండలతోనే గ్రామాల్లో నాటు సారా మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. అధిక ధరలకు మద్యం కొనలేక శానిటైజర్ తాగి సుమారు 50మంది చనిపోయారని, జంగారెడ్డిగూడెం, ఏలూరు పరిసరాల్లో నాటుసారా తాగి ఇప్పటి వరకు 42 మంది మరణించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జె బ్రాండ్లు, జె ట్యాక్సులు, నాటు సారాకు వ్యతిరేకంగా రెండు రోజుల ఆందోళనకు తెదేపా పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మొదటి రోజు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు.
సీఎం జగన్ తక్షణమే రాజీనామా చేయాలి..
జె బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తున్న సీఎం జగన్ తక్షణమే రాజీనామా చేయాలని, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో కల్తీ సారాను నిషేధించాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండు చేశారు. ఎచ్చెర్లలో రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్సీ జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులను పోలీసులు అరెస్టు చేశారు. నాసిరకం మద్యానికి వ్యతిరేకంగా విశాఖ జిల్లాలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కల్తీ మద్యం వ్యాపారానికి పేద ప్రజల ప్రాణాలను ప్రభుత్వం పణంగా పెడుతోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. అనకాపల్లిలో నిరసన ప్రదర్శనలో పాలొన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో కల్తీసారా నిషేధించాలని నిరసన తెలిపారు.
* సీఎం జగన్‌కు ప్రజారోగ్యమంటే లెక్కలేదని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. పెద్దాపురంలో నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. జగ్గంపేట ఇన్‌ఛార్జి జ్యోతుల నెహ్రూ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు.
మద్యం సీసాల ధ్వంసం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మద్యం దుకాణాల వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహిళల తాళిబొట్లతో నిరసన వ్యక్తం చేస్తూ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో మద్యం దుకాణం ఎదుట ఆందోళన చేశారు. కొండపల్లిలో కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమామహేశ్వరరావు, నందిగామలో తంగిరాల సౌమ్య నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో మహిళలు, నేతలు మద్యం సీసాలు పగలగొట్టి ఆందోళన నిర్వహించారు. ప్రకాశం జిల్లా పర్చూరులో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నిరసన తెలిపారు.
* కర్నూలు జిల్లా ఆలూరులో తహసీల్దారు కార్యాలయం వద్ద కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కడప పట్టణం, మైదుకూరు, బద్వేలులో నిరసనలు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో పార్టీ కార్యాలయం నుంచి మద్యం దుకాణం వరకు పార్టీ నేతలు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ఆర్.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి:ముఖ్యమంత్రి సొంత నియోజవర్గంలోనే సారా ఏరులై పారుతోంది: లోకేశ్