కరోనా బాధితులకు న్యాయం చేయాలని..వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు నిరసన చేపట్టారు. అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ‘కరోనా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై సమరభేరి’ పేరుతో మూడవ రోజూ ఆందోళనల్లో పాల్గొన్నారు.
కరోనా విపత్కాలంలో ప్రజారోగ్యం పట్ల సీఎం జగన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు. ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవట్లేదని నారా లోకేశ్ మండిపడ్డారు. కోవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు సరైన ఆహారం అందించడం లేదని నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. కరోనా పరీక్షలు, వైద్యంలో తామే నెంబర్ వన్ అంటూ గొప్పలు చెప్పుకునే వైకాపా నేతలు వైరస్ సోకగానే ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకోవడానికి ఎందుకు పారిపోతున్నారని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. వైరస్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పట్టాభి రామ్ విమర్శించారు. జగన్ సంకుచిత రాజకీయాలు మానుకుని...కరోనాని కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కళా వెంకట్రావు సూచించారు