తెదేపా నేతలు నిత్యం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. ఏడాది పూర్తయ్యింది.. ఇక తెదేపా నాయకులు గేర్ మార్చాలని నిర్దేశించారు. పార్టీ నాయకులతో చంద్రబాబు ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చాక.. మళ్లీ వడ్డీతో సహా ఇంతకింత చెల్లిస్తామని అన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని.. అన్నివిధాలా పోరాడదామని చంద్రబాబు నేతలకు చెప్పారు.
అది జగన్మాయ పథకం
జగనన్న చేదోడు పథకం మరో జగన్మాయ పథకమని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీ నాయకులతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన ఆయన.. అబద్ధమే వైకాపా ఆయుధమని మండిపడ్డారు. గతంలో అందరికీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు దుకాణాలు ఉన్నవారికే ఇస్తామని మాట మార్చారని అన్నారు. చేదోడు పేరుతో భారీగా కోతలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5.50 లక్షల మందికి పైగా నాయీ బ్రాహ్మణులుంటే.. కేవలం 38 వేల మందికే ప్రభుత్వ ఆర్థిక సాయం ఇస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
40 ఏళ్లలో దీటైన నాయకత్వం
రాబోయే 40 ఏళ్లకు దీటైన నాయకత్వం తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. బెదిరింపులు, ప్రలోభాలతో వైకాపా కొందరిని లోబర్చుకుందన్న ఆయన.. వేధింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి ఒకరు వెళ్తే వందమంది తయారవుతారని అన్నారు. తెదేపా హయాంలో సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్న చంద్రబాబు.. వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లులు పది రెట్లు చేసిందని అన్నారు. రజకులు, టైలర్లు అధిక సంఖ్యలో ఉంటే కేవలం కొద్ది మందికే సాయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అసత్యాలతో నయవంచన చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి..