భూసమీకరణలో లేని గ్రామాలను కలిపేసి... అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్(ఏసీసీఎంసీ) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు ఆయన రాసిన బహిరంగ లేఖలో రాజధానికి సంబంధించిన పలు ప్రశ్నలు లేవనెత్తారు. మూడు రాజధానుల అంశం హైకోర్టు పరిధిలో, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉండగా... రాజధాని గ్రామాల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయటం చట్టవిరుద్ధం కాదా అని ప్రశ్నించారు. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నప్పుడు గుర్తుకురాని ప్రజాభిప్రాయ సేకరణ... అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో ఎందుకని నిలదీశారు. రాజధాని తరలింపులో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడమేనన్నారు. రాజధాని అంశాన్ని రాజకీయ క్రీడగా మార్చి ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని విజప్తి చేశారు.అమరావతి రాజధాని సిటీ మున్సిపల్ కార్పొరేషన్ అని చెబుతూనే.. రాజధాని పరిధిలోని గ్రామాల సంఖ్యను కుదించడం వైకాపా ప్రభుత్వ కక్షపూరిత ఆలోచనలకు, స్వార్ధపూరిత విధానాలకు నిదర్శనమని అన్నారు. రైతులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రూ.4 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని వివరించారు.ఇప్పటికైనా అమరావతి విషయంలో సంకుచిత ఆలోచనలు మాని.. ఉదారంగా ఆలోచించాలని... రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు.
ఇదీ చదవండి:అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌కు సన్నాహాలు!