రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వైకాపా ప్రభుత్వానికి భవిష్యత్తులో మూల్యం తప్పదని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. " రాష్ట్ర ఉగ్రవాదం- న్యాయ ఉల్లంఘన- ప్రజాస్వామ్యం వెనుకంజ" అంశంపై మహానాడులో దీపక్ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని గౌతు శీరీష, ఎంఎస్ రాజు, జవహర్లు బలపరిచారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అవహేళన అవుతోందని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దుయ్యబట్టారు. . ప్రతి రోజూ రాజ్యాంగంపై అత్యాచారం జరుగుతోందని మండిపడ్డారు. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గౌతు శిరీష ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు విమర్శించారు. ఎస్సీలపై దాడితో సమాజం భయపడుతుందన్నది జగన్ రెడ్డి భావనగా అనిపిస్తోందని మాజీ మంత్రి జవహర్ ఆక్షేపించారు. రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చారని అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏసీబీ, జేసీబీ, పీసీబీల పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేస్తే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: