నాణ్యమైన విద్యతోనే విద్యార్థులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తారన్న వాస్తవాన్ని సీఎం జగన్ విస్మరించారని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. నాణ్యమైన విద్యాబోధన అందించే రాష్ట్రాల జాబితాలో ఏపీని చంద్రబాబు 3వ స్థానంలో నిలిపితే,.. జగన్ రెడ్డి 19వ స్థానానికి చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులుంటే, కేవలం 40లక్షల మందికి అమ్మఒడి ఇస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన మేలైన విద్య అందకూడదన్నదే వైకాపా ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే-2020 రిపోర్ట్ ప్రకారం ఏపీలో 3, 4, 5 తరగతుల విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు.
సమాజగతిని మార్చే.. విద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి కె.ఎస్. జవహర్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి లాభాపేక్షకు రాష్ట్రవిద్యారంగం నాశనమైందని ధ్వజమెత్తారు. కొఠారి కమిషన్ నిబంధనల అమలుకు ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పిల్లలే విదేశాల్లో చదవాలా..దళితులు చదవకూడదా అని జవహర్ నిలదీశారు. జగన్ రెడ్డి మూడు వేల పాఠశాలలు మూసేసి.. 25వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీని విస్మరించారన్నారు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన జీతాన్ని వాలంటీర్లకు ఇస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 490కు పైగా మున్సిపల్ పాఠశాలల్ని ఎందుకు మూసేశారని నిలదీశారు.
ఇదీ చదవండి: జానీ డెప్-అంబర్ హెర్డ్.. ప్రేమ కథ నుంచి కోర్టు దాకా.. వయా ఎలాన్ మస్క్!