హేతుబద్దీకరణ పేరుతో.. వైకాపా ప్రభుత్వం భారీగా విద్యుత్ చార్జీలు పెంచుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు దుయ్యబట్టారు. ఇప్పటికే ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి 14 వేలకోట్ల భారం మోపిందని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల విషయంలో మడమ తిప్పిన జగన్ రెడ్డి.. రానున్న రోజుల్లో మొత్తంగా 20 వేల కోట్లపైబడి ప్రజలపై భారం మోపనున్నారన్నారు.
రాష్ట్రాన్ని మత్తాంధ్రప్రదేశ్‌గా మార్చారు..
జగన్మోహన్ రెడ్డి తనస్వార్థం కోసం రాష్ట్రాన్ని మత్తాంధ్రప్రదేశ్‌గా మార్చి, యువత భవిష్యత్‌ను నిర్వీర్యం చేస్తున్నారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తన వైఫల్యాలపై యువత, మరీ ముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో.. ముఖ్యమంత్రి వారిని మత్తులో జోగేలా చేస్తున్నారన్నారు. అందుకోసం ఏపీలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను తన పార్టీ వారి అండ దండలతో విచ్చలవిడిగా చలామణీ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడుతున్నారు: వంగలపూడి అనిత
ప్రాణాలంటే విలువలేని జగన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. రాక్షత్వం ప్రదర్శిస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో గిరిజన గర్భిణీకి మౌలిక వసతులు లేక పడిన వేదన దారుణమన్నారు. గిరిజన గర్భిణీ వరలక్ష్మికి సంబంధించిన అనిత ఓ వీడియోను ప్రదర్శించారు. సినిమా హీరోలకు తమ దాకా వస్తే కానీ పరిస్థితి అర్ధం కాలేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా హీరో నాని బయటకు వచ్చి మాట్లాడటం శుభపరిణామన్నారు.
ప్రజలకు మేలు చేసేవారిపై తప్పుడు కేసులు పెడతారా?
ప్రజలకు మేలు చేస్తూ.. నిత్యం వారి యోగక్షేమాల కోసం వేలాది ఎకరాలు దానంచేసిన అశోక్ గజపతిరాజుపై తప్పుడు కేసులు పెడతారా? అంటూ మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్.వర్మ మండిపడ్డారు. ఆలయ ధర్మకర్త హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజుని అవమానించిన వారు.. ఆయన కాలిగోటికి కూడా సరిపోరని వర్మ అన్నారు.
ఇదీ చదవండి:
Invitation Letter to CJI : విద్యార్థులారా... లేఖ రాసి సీజేఐకి స్వాగతం పలకండి..