పోలవరంపై విలేకరుల ప్రశ్నలకు జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సమాధానం చెప్పకుండా మీడియాపై చిందులు వేయడమేమిటని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. తెదేపా మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, అమర్‌నాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శనివారం ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
‘పోలవరం గురించి మొన్నటివరకు జలవనరులశాఖను చూసిన మంత్రిని అడిగితే నో మినిస్టీరియల్ క్వశ్చన్స్ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన మిమ్మల్ని అడిగితే దబాయిస్తున్నారు. ఇదేం పద్ధతి మంత్రిగారు?’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
‘ఒక్కో మీడియాకు ఒక్కోలా సమాధానం ఇవ్వడానికి మీరు నడిపేది మోలీలు చేసే సర్కస్ కంపెనీ కాదు’ అని అమర్‌నాథరెడ్డి మండిపడ్డారు. ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ప్రాజెక్టుల గురించి నీళ్ల శాఖ మంత్రిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతారేంటి?’ అని కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు.
‘మొదటి కృష్ణుడు మేకప్ తీసేస్తే.. రెండో కృష్ణుడిగా ఇప్పుడే మేకప్ వేశారుగా! భుజాలు తడుముకుంటారేంటి? అంత తొందరెందుకు?’ అని బీటెక్ రవి ప్రశ్నించారు. ‘మంత్రి పదవిచ్చింది జలవనరుల గురించి వివరించడానికే’ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
ఇదీ చదవండి: "చెప్పేది చెబుతా.. ఇష్టమెుచ్చింది రాసుకోండి".. మీడియాపై మంత్రి రుబాబు!