ఎస్సీ వర్గాలపై వరుస దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు, శిరోముండనాలు, అఘాయిత్యాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఏడాదిన్నరగా అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై జరిగిన దాడులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
విశాఖ శిరోముండనం ఘటన వెనుక ఎవరున్నారని..? ప్రశ్నించారు. వీడియో బయటకు వచ్చాయనే కొందరిని అరెస్టు చేశారని తెలిపారు. ఘటనకు సంబంధించిన నూతన్ నాయుడును ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఇలా చేశారంటే నమ్మలేమని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సీల ద్రోహి ఎవరో ఎస్సీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు.
'వైకాపా మేనిఫెస్టో రాసిన నూతన్‌నాయుడే ఘటనలో కీలక వ్యక్తి. అధికార పార్టీలోని ఎస్సీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కాస్త మోకాళ్లపై నిలబడే ధైర్యం చేయాలి. మూడు, నాలుగేళ్ల పదవుల కోసం ఆత్మగౌరవం లేకుండా ప్రవర్తిస్తారా..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి మాట్లాడే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. వైసీపీలోని ఎస్సీ ప్రజాప్రతినిధులు ఎందుకు పెద్దిరెడ్డిని ప్రశ్నించరు? జగన్మోహన్ రెడ్డి విధానాలు ఎస్సీ వ్యతిరేక విధానాలని నిరూపించడానికి నేను సిద్ధం'- వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
ఇదీ చదవండి