దేశంలో మరే రాష్ట్రం చేయనంత అప్పును 5 నెలల్లో ఏపీ చేసిందని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. సీఐజీ నివేదికలు పరిశీలిస్తే గత 5 నెలల కాలంలోనే బడ్జెట్ అంచనాల్లో 97 శాతం అప్పును ఆంధ్రప్రదేశ్ చేసిందన్నారు. వివిధ రాష్ట్రాలు గత 5 నెలల్లో చేసిన అప్పులు, ఆయా రాష్ట్రాల ఆదాయం తగ్గుదల, రెవెన్యూ లోటుపై ఓ వీడియో ప్రదర్శన ఇచ్చారు. అప్పుల్లో 47,146 కోట్ల రూపాయలతో ఏపీ అగ్రస్థానంలో ఉంటే కేవలం 0.89 శాతం మాత్రమే ఆదాయం తగ్గిందని వివరించారు. ఆదాయం తగ్గి, కరోనా కష్టాల వల్ల అప్పులు ఎక్కువ చేశామన్న ఆర్థికమంత్రి బుగ్గన మాటలు అవాస్తవమని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని మండిపడ్డారు.
తెదేపా 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పులకు వడ్డీ భారం 5400కోట్ల రూపాయలైతే... వైకాపా 16 నెలల్లోనే చేసిన అప్పులకు 5300 కోట్ల వడ్డీ భారం మోపిందని ధ్వజమెత్తారు. 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానిని 5 ఏళ్లలో 2110 కోట్లు తెదేపా ప్రభుత్వం తగ్గించి 13800 కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్రాన్ని వైకాపాకు అప్పగించిందన్నారు. 16 నెలల వైకాపా పాలనలో అదనంగా 25 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు నమోదై 38,199 కోట్ల రూపాయలకు చేరిందని మండిపడ్డారు. తెచ్చిన అప్పంతా అవినీతికి వెచ్చించారు తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమని పట్టాభి దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు వెచ్చించామని చెప్తూనే ప్రజలపై విద్యుత్, ఇంధనం, ఎక్సైజ్ ధరలు పెంచి పన్ను భారం మోపారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: