tdp leader Murder: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెదేపా నేత హత్య కలకలం సృష్టించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెదేపా అధ్యక్షుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున గ్రామ కూడలిలో కూర్చుని ఉన్న సమయంలో కర్రలు, రాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం అక్కడ్నుంచి దుండగులు పారిపోయారు.
పాత కక్షలే కారణామా..?
గ్రామంలో పాత కక్షలే హత్యకు దారి తాసినట్లు తెలుస్తోంది. మాచర్ల తెదేపా ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి చంద్రయ్య ముఖ్య అనుచరుడు. ఇటీవల బ్రహ్మారెడ్డి వెంట తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ కారణంగానే చంద్రయ్యను హత్య చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గుండ్లపాడులో ఉద్రిక్తత..
గుండ్లపాడులో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చంద్రయ్య మృతదేహం తరలించేందుకు పోలీసుల యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ చంద్రయ్య కుటుంబసభ్యుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డి వచ్చేవరకు మృతదేహం ఉంచాలని పట్టుబట్టారు. పంచనామా నిమిత్తం చంద్రయ్య మృతదేహం మాచర్లకు తరలించారు.
వెంటనే అరెస్ట్ చేయాలి : నారా లోకేశ్
చంద్రయ్య హత్యపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ సీఎం అయ్యాక ప్రజలు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రశ్నించేవారిపై దాడులు, పోరాడేవారిని అంతమొందించడం అలవాటైందని ఆరోపించారు. చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. హత్యకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి
COCK FIGHTS IN AP: కత్తిగట్టి కయ్యానికి సై అంటున్న పందెం కోళ్లు.. సిద్ధమైన బరులు