పురపాలక ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందంటూ తెలుగుదేశం నేతలు ఎస్ఈసీ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని.... తక్షణమే వారిని అడ్డుకోవాలంటూ అశోక్‌బాబు, బొండా ఉమ, బోడె ప్రసాద్ వినతిపత్రం అందజేశారు. వైకాపా అక్రమాలపై తెలుగుదేశం ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొందరు తెలుగుదేశం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేరు
ఎన్నికల నిర్వహణ సజావుగా జరగట్లేదని అశోక్‌బాబు అన్నారు. వైకాపా నాయకులే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కమలాపురంలో ఏజెంట్లకు పాస్లు ఇవ్వలేదని... గట్టిగా అడిగితేనే అందజేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. అలాగే పలుచోట్ల వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని... ఈ విషయంపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని అశోక్ బాబు పేర్కొన్నారు. బోగస్ ఓట్లు వేసేందుకు వచ్చేవారిని అరెస్టు చేసి.. డీఎస్పీని బదిలీ చేయాలని కోరినా ప్రయోజనం లేదన్నారు. వైకాపా నేతలు చెప్పినట్లే పోలీసులు పనిచేస్తున్నారని.. ఓటర్లను ప్రలోభపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిందితులకు బదులు.. ఏజెంట్లను అరెస్ట్ చేస్తున్నారు..
పోలీసులే వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని బొండా ఉమ విమర్శించారు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నా... క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోలు, వీడియోలతో సహా అన్ని ఆధారాలు సమర్పించినా... నిందితులకు బదులుగా ఎన్నికల ఏజెంట్లను రాత్రికిరాత్రే అరెస్టు చేయడం దారుణమని తెలిపారు. కుప్పం పరిసరాల్లో వైకాపా మంత్రులంతా మోహరించారని బొండా ఉమ పేర్కొన్నారు. బెదిరింపులకు భయపడేది లేదన్న ఆయన... పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వస్తుంటే పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలపై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
సంబంధిత కథనాలు:
KUPPAM ELECTIONS: కుప్పంలో దొంగ ఓటర్లు.. అడ్డుకున్న తెదేపా.. ఉద్రిక్తత