రాష్ట్ర రాజధాని అమరావతి భూముల అంశంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు సవాలు చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
గత ప్రభుత్వం హయాంలో అవకతవకలు జరిగాయని భావించి జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. ఆరు నెలల తర్వాత సబ్ కమిటీ నివేదిక ఆధారంగా అమరావతిలో భూ అవకతవకలపై సిట్ ఏర్పాటు చేశారని అన్నారు. ఈ దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు స్టే విధించడం సరికాదంటూ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
అమరావతి అంశంలో ఏకపక్షంగా వెళ్లడం లేదని... సీబీఐతో దర్యాప్తు జరపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు కోర్టు దృష్టికి దవే తీసుకువచ్చారు. ఈ అభ్యర్థనపై కేంద్రం నుంచి స్పందన వచ్చిందా అని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం ప్రశ్నించగా.. ఇంతవరకు లేదని దవే సమాధానం ఇచ్చారు.
గతంలో అధికారంలో నేతలు రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని.. దాన్ని హైకోర్టు ప్రోత్సహించడం సరికాదని దుష్యంత్ దవే కోర్టుకు విన్నవించారు. ఈ దశలో కలుగజేసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్...గత ప్రభుత్వ నిర్ణయాలు సమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీ వేశారా అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. అన్నింటిపై కాదని.. అవకతవకలు జరిగాయని భావించిన అంశాలపైనే కమిటీ వేసినట్లు తెలిపారు. ప్రతివాదులు నోటీసులు జారీచేయాలని దుష్యంత్ దవే కోర్టును కోరారు.
స్టే ఎత్తివేతపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ధర్మాసనం... నాలుగు వారాల్లో పిటిషన్‌పై, స్టే ఎత్తివేయాలన్న అంశాలపై సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర, డీజీపీ, సిట్‌కు శ్రీముఖాలు అందించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: నూతన ఇసుక విధానానికి మంత్రి వర్గం ఆమోదం