న్యాయమూర్తులపై సీఎం జగన్ భవిష్యత్తులో బహిరంగ విమర్శలు చేయకుండా చూడటం, అమరావతి భూముల విచారణకు మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు స్టేపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్, రాజధాని భూముల కొనుగోళ్లకు సంబంధించి ఏసీబీ దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన స్టే పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ల విచారణను మార్చి 5న పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఎదుటకు ఈ మూడు పిటిషన్లు మంగళవారం విచారణకు వచ్చాయి.
అమరావతి ప్రాంతంలో భూ కొనుగోళ్లు, ఇతర అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ల ఏర్పాటుకు సంబంధించి కేసులో విచారణ సందర్భంగా గతేడాది నవంబరు 5న... ప్రతివాదులుగా ఉన్న వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. 8 వారాలు ముగిసినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వారంలో రిజాయిండర్లు దాఖలు చేయొచ్చని సూచించింది.
న్యాయమూర్తులపై సీఎం జగన్ బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించబోగా మార్చి 5న విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ రెండు కేసులతో పాటే అమరావతి భూ కొనుగోళ్లతో ముడిపడిన మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ మరికొందరిపై ఉన్న పిటిషన్‌ను విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.
ఇదీ చదవండి