ప్రశ్న: కొవిడ్‌ను గుర్తించి ఎనిమిది నెలలు అవుతోంది. డబ్ల్యూహెచ్‌వో కూడా దీన్ని మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఇప్పుడు వైరస్‌పై కొంత అవగాహన వచ్చింది. ఈ సమయంలో దీనికి అత్యుత్తమ వైద్య విధానం ఎమిటి ?
డా.లోకేశ్: కొవిడ్ చికిత్సలో ఇప్పటి వరకూ చాలా విధానాలు పరిశీలించారు. స్టెరాయిడ్లను ముందుగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వీటిని మేము మూడు నెలల క్రితమే గుర్తించాం. మా అనుభవంతో 80 శాతం మంది బాధితులకు వాళ్ల ఇంటివద్దే చికిత్స అందించవచ్చని భావిస్తున్నాం. ఫ్యాబీఫ్లూ, రెమిడెసివర్, ప్లాస్మా వంటి వాటిపై చాలా ఆశలు పెట్టుకున్నాం. అమెరికా, భారత్‌లో ఇళ్ల వద్ద చికిత్స అందించడం చాలా తక్కువ. ఈ విషయంలో ఈ రెండు దేశాలు వెనకబడే ఉన్నాయి.
ప్రశ్న: స్టెరాయిడ్ల వాడకం ఎప్పుడు ప్రారంభమైంది. దాని ప్రభావం ఎలా ఉంది..?
డా.సురేశ్: కొవిడ్ రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో చనిపోయేవారు చాలా అరుదు. ఈ దశలో కొంచెం జ్వరం, దగ్గు, నలతగా ఉండటం... ఇవి సాధారణంగానే తగ్గిపోతాయి. వైరస్ మొదటి దశలో శరీరంలోకి ప్రవేశించి... వివిధ కణాలలోకి వెళ్తుంది. అక్కడ జన్యువులుగా మారి విస్తరిస్తుంది. ఇలా విస్తరించకుండా ముందే అప్రమత్తం అవ్వాలి. కొవిడ్ నిర్ధరణ అయిన వెంటనే.. చికిత్స ప్రారంభించాలి. అప్పుడు దీర్ఘకాలిక సమస్యలు ఉండవు. అందుకే మేం ముందుగా చికిత్స చేస్తున్నాం. కొరోనా వైరస్ వల్ల కలిగే ప్రభావం కంటే .. దానికి మన రోగనిరోధక వ్యవస్థ స్పందిస్తున్న తీరు వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. కొవిడ్ ను ఎదుర్కొనే సైటోకిన్ లు రక్తనాళాల్లో ఎక్కువుగా చేరిపోవడం వల్ల అడ్డంకులు ఏర్పడతాయి. స్టెరాయిడ్స్ వీటిని తగ్గిస్తాయి. ఏప్రిల్ మొదట్లోనే డెక్సామెథజోన్.. వాడటం మొదలు పెట్టాం. ఈ తరగతి లోని ఇతర స్టెరాయిడ్స్ కూడా వాడొచ్చు. డెక్సామెథజోన్ అనేది ఒక గేమ్ చేంజర్‌గా మారింది. అయితే వీటిని వాడే విషయంలో.. ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. ఇతర సమస్యలు వస్తాయన్న ఉద్దేశ్యంతో చాలా మంది వైద్యులు ముందుకు రావడం లేదు. ఈ విషయంలో ఆసుపత్రులను ఒప్పించడం సమస్యగా మారింది. అందుకే ముందుగా మా క్లినిక్‌లలో ప్రారంభించాం. మంచి ఫలితం వచ్చింది.
ప్రశ్న: ఆసుపత్రికి వెళ్లడాన్ని తగ్గించేందుకు స్టెరాయిడ్ల వినియోగాన్ని ఒక పరిష్కారంగా చూడవచ్చా..?
డా.లోకేశ్: వైరస్ సోకిన వారిలో నూటికి 80మందికి స్వల్ప లక్షణాలు.. అసలు లక్షణాలు లేకపోవడమో ఉంటాయి. వీరు ఆసుపత్రికి వెళ్ళకుండానే కోలుకుంటారు. అయితే మిగిలిన 20 శాతం మందిలో కూడా ఎక్కువ మందికి ఇప్పుడు ఇంటి వద్దనే చికిత్స అందించవచ్చు. స్టెరాయిడ్స్ ఇవ్వడం ద్వారా వీరు కోలుకుంటారు.
ప్రశ్న: ఈ 20 శాతం మంది కూడా ఆసుపత్రికి వెళ్లకుండా... స్టెరాయిడ్ల వినియోగం ఉపయోగపడుతుందా..?
డా.లోకేశ్: అవును... స్టెరాయిడ్ల వినియోగం వీలైనంత త్వరగా ప్రారంభిస్తే.. ఆసుపత్రికి వెళ్లకుండా నిరోధించవచ్చు. వందమందిలో కేవలం ఇద్దరు, ముగ్గురే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
ప్రశ్న: ఏ తరహా లక్షణాలున్నవారికి చికిత్సలో స్టెరాయిడ్లు వినియోగించవచ్చు..? ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నవారికీ దీన్ని వినియోగించవచ్చా..?
డా.సురేశ్: ఉదాహరణకు.. 100 మందికి వైరస్ సోకితే వారిలో 80 మందికి మొదటి దశలో నయమవుతుంది. వారు రెండోదశలోకి వెళ్లరు. మిగతా 20 మందే రెండో దశలోకి వెళ్తారు. వారికీ దాదాపు నయమవుతుంది. కానీ... వీరు రెండోదశలోకి రాకుండా చూడాలి. అందుకే స్టెరాయిడ్ల వినియోగం ప్రారంభించాలి. అప్పుడు ఈ 20 శాతం మందికీ ఎలాంటి హాని ఉండదు.
ప్రశ్న: ఈ లక్షణాలు ఉన్నవారిని ఎలా గుర్తిస్తారు..? ఎవరికి చికిత్స ప్రారంభించాలి...?
డా.సురేశ్: చాలామందికి ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు ఉంటాయి. ఇవి రాగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగెడతారు. కొంచెం నలతగా ఉండటం, రోజంతా పడుకోవడం, తలనొప్పి వంటి చిన్నచిన్న సమస్యలు వస్తాయి. ప్రారంభ దశలో హైపోఆక్సిమీయా వస్తుంది. అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం. అందుకే ప్రతీఒక్కరు పల్స్ ఆక్సీమీటర్ తీసుకోవాలి. 2-3 నిమిషాలు నడిచి పల్స్ ఆక్సీమీటర్లో పరీక్షించుకోవాలి. ఇందులో 94శాతం కంటే తక్కువగా ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. అప్పుడు స్టెరాయిడ్లను ఉపయోగిస్తే.. రెండో దశను ఆపేయొచ్చు.
డా.లోకేశ్: 3 నిమిశాలు నడిస్తే.. 94శాతం కంటే తక్కువ పల్స్ ఉంటే స్టెరాయిడ్లు వాడాలి. సీటీస్కాన్ చేసినప్పుడు పాజిటివ్ నిర్ధరణ అయినా డోస్ తగ్గకుండా స్టెరాయిడ్లు వాడాలి. ఈ సందర్భాల్లో స్టెరాయిడ్ల వాడకాన్ని అసలు నిర్లక్ష్యం చేయొద్దు. భారత్‌లోనూ అక్కడక్కడా స్టెరాయిడ్లు వాడుతున్నారు. కానీ తక్కువ డోస్ ఇస్తున్నారు. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండట్లేదు. దీన్ని కనీసం పది రోజులైనా వాడాలి.
ప్రశ్న: గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పల్స్ ఆక్సీమీటర్ ఉపయోగించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరికైనా ప్రాథమిక లక్షణాలు ఉంటే... ప్రాంతీయ వైద్యులు స్టెరాయిడ్ వాడాలని మీరు సూచిస్తున్నారా...?
డా.లోకేశ్: దాదాపు అందరు ఏఎన్ఎంల వద్ద పల్స్ ఆక్సీమీటర్లు అందుబాటులో ఉన్నాయి అని ఇక్కడి వైద్యాధికారులు చెప్తున్నారు. ఒకవేళ లేకపోతే.. వచ్చిన వ్యక్తి లక్షణాలు, పరిస్థితిని బట్టి ఐసీఎంఆర్ సూచనల ప్రకారం స్థానిక వైద్యుడు స్టెరాయిడ్ వినియోగించవచ్చు.
ప్రశ్న: మీరు చికిత్స చేసిన పేషెంట్ల నుంచి స్పందన ఎలా ఉంది..?
డా.సురేశ్: ప్రస్తుతం అవలంబిస్తున్న చికిత్స విధానం కంటే... మేం స్టెరాయిడ్ వినియోగించి ఇచ్చే వైద్యంతో రికవరీ రేటు పెరిగింది. డెక్సామెథజోన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని ఆక్స్ఫర్డ్ చెప్పడానికి ముందే మేము వాడటం మొదలు పెట్టాం. మేం ఇళ్ల వద్ద చికిత్స ప్రారంభించిన ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నారు. కేవలం ఒక్కరే వెంటిలేటర్‌పై మూడు రోజులు మాత్రమే చికిత్స తీసుకొని కొలుకున్నారు. భారత్‌లో స్టెరాయిడ్ వినియోగం ఉత్తమం. ఎందుకంటే ఇది అందుబాటులో ఉంటుంది. ఖర్చు కూడా తక్కువ.
ప్రశ్న: స్టెరాయిడ్ ఎక్కువగా వాడొద్దని... దీని వాడకం షుగర్ ఉన్నవారికి ఇతర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని కొన్ని వాదనలున్నాయి. దీనికి మీరేమంటారు..?
డా.లోకేశ్: ఇది అపోహ మాత్రమే. షుగర్‌ను కంట్రోల్ చేయడం చాలా సులభం. కానీ కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో స్టెరాయిడ్ వాడకపోతే చాలా ప్రమాదం. స్టెరాయిడ్ వాడటానికి భయపడి కొంతమంది ఆసుపత్రులకు వెళ్లారు. వారికి మళ్లీ స్టెరాయిడ్ ఉపయోగించి చికిత్స చేశారు. ఫలితంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది.
ప్రశ్న: స్టెరాయిడ్ వాడిన తరువాత ఎలాంటి మార్పులు వచ్చాయి..?
డా.సురేశ్: కొవిడ్ చికిత్స విషయంలో ఇది ఒక గేమ్ చేంజర్. ప్రస్తుతం త్వరగా నయం కావాలంటే... ఇది తప్ప వేరే మార్గం లేదు. చాలా పరిశోధనల్లో ఇదే స్పష్టం అవుతోంది. వేరే ఏ మార్గం మరణాల సంఖ్యలను ఆపగలిగిందో చెప్పండి..? స్టెరాయిడ్‌పై అవగాహన లేక కొందరు అపోహాలు సృష్టిస్తున్నారు.
ప్రశ్న: ఆసుపత్రికి వెళ్లేవారిలోనే 90 శాతం మందికి ఇంట్లో చికిత్స చేయవచ్చు అంటున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని... ఆసుపత్రికి కచ్చితంగా వెళ్లాల్సిన వారిని ఎలా గుర్తించాలి...?
డా.సురేశ్: కొవిడ్ సోకిన వారికి అప్పటికే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే ఇంట్లో వైద్యం చేయడం కష్టం. ఎందుకంటే వారికి ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారిని ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం చేయించడం ఉత్తమం. ఇది కూడా వారికి వారు గుర్తించుకునే వీలుంది. నడవడం, పల్స్ ఆక్సీమీటర్లో పరీక్షలు చేసుకోవడం ద్వారా లక్షణాలు గుర్తించవచ్చు. వెంటనే అప్రమత్తమై వైద్యుల సలహాలు తీసుకుంటే వారు కూడా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ప్రశ్న: ప్లాస్మాథెరపీపై పరిశోధనలు ఏం చెప్తున్నాయి..? మీ అనుభవాలేంటీ..?
డా.సురేశ్: ప్లాస్మాథెరపీ ద్వారా యాంటీబాడీస్ ఎక్కిస్తున్నారు. ఇది వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అయితే ఇది అంత ప్రభావం చూపుతున్నట్లు రుజువు కాలేదు.
ప్రశ్న: ప్రస్తుతం అన్ని దేశాల కంటే భారత్‌లో కేసుల సంఖ్య.. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని నిరోధించడానికి ఎలాంటి వ్యూహం ఉండాలి.. ?వైద్యులు: కొవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. చాలామంది భయంతో ఆసుపత్రులకు వెళ్లడం లేదు. అలాంటి వారికి స్టెరాయిడ్ వంటి విధానం అందుబాటులో ఉందని వివరించాలి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వైరస్ సోకిన మొదట్లోనే స్టెరాయిడ్ ద్వారా చికిత్స అందించాలి. అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర ముఖ్యమైంది. రాజకీయ నాయకులు కూడా ప్రజలకు ధైర్యం చెబుతూ... స్టెరాయిడ్ విధానంతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకునేలా చేయాలి.
ఇదీచదవండి.