చంద్రబాబు కుటుంబంపై వ్యాఖ్యలకు నిరసనగా.. తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టాయి. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసెంబ్లీలో వైకాపా నాయకులు విమర్శలు చేయడం తగదని తెదేపా నేతలు హెచ్చరించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
తూర్పుగోదావరి జిల్లా..
వైకాపా నాయకుల వైఖరికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలుగుదేశం నాయకులు ధర్నా చేపట్టారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై అసెంబ్లీలో వైకాపా నాయకులు విమర్శలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
శ్రీకాకుళం జిల్లా..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆవేదన చెందారు. నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేశారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించారు.
కృష్ణా జిల్లా..
తెదేపా నాయకులు, కార్యకర్తలు కృష్ణా జిల్లా మిట్టగూడెంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి బూతులు మాట్లాడే మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చిత్తూరు జిల్లా..
చిత్తూరులో తెదేపా శ్రేణుల నిరసన చేపట్టాయి. సుధాకర్‌రెడ్డితోపాటు ఇతర నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు కుటుంబంపై వైకాపా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న జీడీ నెల్లూరు నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త చిట్టిబాబును గృహనిర్బంధం చేశారు. శ్రీరంగరాజపురం మండల తెదేపా అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
విజయనగరం జిల్లా..
విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగు యువత బైఠాయించింది. వైకాపా నేతల వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆందోళన చేపట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా..
తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణని పోలీసులు అరెస్టు చేశారు. ధర్నా చేయకుండా గృహనిర్బంధం చేసిన పోలీసులు..ఇంటి నుంచి ధర్నాకు బయల్దేరుతున్న సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా..
బలుసుపాడు అడ్డరోడ్డు వద్ద తెదేపా శ్రేణులు ఆందోళన చేశాయి. సత్తెనపల్లి-అమరావతి ప్రధాన రహదారిపై నిరసనలు తెలిపారు.
ఇదీ చదవండి : CHANDRABABU: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి చంద్రబాబు ఇలా..