Palamuru Rangareddy Project: గత కొన్నేళ్లుగా కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం అభ్యర్థిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నారని తెలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్-మధ్యప్రదేశ్ మధ్య కెన్-బెట్వా నదుల అనుసంధానాన్ని రూ.44,605 కోట్లతో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కేంద్ర మంత్రిమండలి తాజాగా ఆమోదం తెలిపింది. కర్ణాటకలోని ఎగువ భద్ర, బిహార్‌లో కోసిమెచి ప్రాజెక్టులకు సైతం త్వరలోనే జాతీయ హోదా ఇచ్చే అంశం చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఎన్‌డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ హోదా దక్కితే ప్రాజెక్టు వ్యయంలో 90 శాతాన్ని కేంద్రమే భరిస్తుంది.
కెన్-బెట్వా ప్రాజెక్టును జాతీయ హోదా..
విభజన చట్టంలో హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు యూపీఏ ప్రభుత్వం జాతీయ హోదా కల్పించింది. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ పలుమార్లు కోరింది. అయితే ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చేది లేదని 2018 ఆగస్టులో అప్పటి కేంద్ర జలవనరులశాఖ మంత్రి గడ్కరీ లోక్‌సభలో ప్రకటించారు. దీనికి భిన్నంగా కోసిమెచి, ఎగువ భద్ర ప్రాజెక్టులను జాతీయ హోదాకు కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది. తాజాగా కేంద్రం కెన్-బెట్వా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంది.
ఇకనైనా గుర్తించాలంటూ..
కేంద్రం నిర్ణయం తెలియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు రోజులుగా పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో ఈ అంశంపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినందున ప్రస్తుతం రూ.38,200 కోట్లతో నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రధానికి సీఎం లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయిదు లక్షల ఎకరాలకు పైగా సాగు గల ఈ ప్రాజెక్టుకు అర్హత ఉందని, విభజన సమయం నుంచి తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయహోదాను కోరుతున్నందున ఇకనైనా కేంద్రం గుర్తించాలని ఆయన కోరనున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్, యూపీ, కర్ణాటక, బిహార్ వంటి రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కోరారు.
ఇదీ చదవండి: