కొత్త రకం కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. గురువారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి... రాష్ట్రంలో నూతనంగా నిర్మించనున్న వైద్య కళాశాలలపై సమీక్షించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు చేయాలని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. అలాగే రాజమహేంద్రవరంలో కొత్తరకం కరోనా వైరస్ కలకలంపై మంత్రి స్పందించారు.
రాజమహేంద్రవరంలో యూకే నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించాం. బాధితురాలికి కరోనా స్ట్రెయిన్ సోకిందో లేదో తెలుసుకోవడానికి నమూనాలను పుణే ల్యాబ్‌కు పంపించాం- ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి:
బ్రిటన్ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్