Gas Cylinder Blast in Pedakakani : విధి ఎంత విచిత్రమో. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి మూడు గ్యాస్ సిలిండర్లు పేలగా అదృష్టవశాత్తు ఆ కుటుంబీకులందరూ ఆ సమయంలో గుడికి వెళ్లారు. కానీ ప్రమాద స్థలానికి చూడటానికి వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం సిలిండర్ లోహపు ముక్క తగిలి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అమ్మిశెట్టి శ్రీనివాసరావు, భార్య, కుమార్తె సుజాత కుటుంబాలు ఒకే పూరిగుడిసెలో రెండు భాగాల్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం ఇంట్లో కార్తిక దీపాలు వెలిగించి పూజ చేసి గ్రామ శివారులో ఉన్న నాగేంద్రస్వామి పుట్ట వద్దకు వెళ్లారు.
ప్రమాదాన్ని చూసేందుకు వెళ్లి : ఉదయం 11 గంటల ప్రాంతంలో పూరింట్లో నుంచి మంటలు వ్యాపించి రెండు సిలిండర్లు పేలాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని చూసేందుకు అదే గ్రామానికి చెందిన రైతు అమ్మిశెట్టి తులసీనాథ్ (37), గుంటముక్కల పరమేష్, వీరాంజనేయులు, మల్లికార్జునరావు వచ్చారు. ఆ సమయంలో ఆ ఇంట్లోని మూడో సిలిండర్ పేలి దాని లోహపు ముక్కలు ఆ నలుగురిపై పడటంతో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయాలవ్వడంతో చికిత్స పొందుతూ తులసీనాథ్ మృతి చెందారు. అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలు ఆర్పేశారు. పెదకాకాని సీఐ నారాయణస్వామి ఘటనా స్థలిని పరిశీలించారు.
బోరున విలపించిన భార్య : రైతు అమ్మిశెట్టి తులసీనాథ్ ఆదివారం పొలానికి వెళ్లి గడ్డి మందు పిచికారి చేసి వచ్చారు. అనంతరం అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న అత్తారింటికి వెళ్లి అక్కడే ఉన్న భార్య, పిల్లలను పలకరించారు. ముందు జాగ్రత్తగా ఆ ఇంట్లోని విద్యుత్ సరఫరా నిలిపివేసి, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ తొలగించాడు. తర్వాత ఘటన జరిగిన ఇంటిని చూసేందుకు తులసీనాథ్ వెళ్తుండగా భార్య లక్ష్మీ తిరుపతమ్మ వెళ్లొద్దని హెచ్చరించింది. దూరంగా ఉండి చూసి వస్తానని వెళ్లిన కొద్దిసేపటికే సిలిండర్ పేలి ముక్క ఆయన తలకు బలంగా తగిలింది. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన భర్తను చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరోవైపు అమ్మిశెట్టి శ్రీనివాసరావు ఇటీవలే ఇల్లు నిర్మించుకునేందుకు చిట్టీ పాడిన నగదు, భార్యకు డ్వాక్రాలో వచ్చిన నగదు మొత్తం రూ.5 లక్షలు బీరువాలో దాచుకున్నారు. అగ్ని ప్రమాదంలో నగదు మొత్తం కాలి బూడిదైంది.
ప్రాణం తీసిన ఉల్లిగడ్డ బాంబు - ఒకరు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు
కొబ్బరి చెట్టుపై పిడుగు - బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - ఇద్దరు మృతి