అమరావతి రాజధాని ప్రాంతంలో సింగపూర్ కన్సార్షియం ఏర్పాటు చేయనున్న స్టార్టప్(అంకుర) ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు రద్దయ్యింది. పరస్పర అంగీకారంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించి.. స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు.
ఇప్పటి వరకూ స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుపై సింగపూర్ కన్సార్షియం వెచ్చించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. రాజధానిలో 16 వందల 91 ఎకరాలను స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుగా గుర్తించి.. సింగపూర్ కన్సార్షియం సంస్థలైన అసెండాస్ సింగ్ బ్రిడ్జ్-సెంబ్ కార్ప్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ కన్సార్షియాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది.
స్టార్టప్ ప్రాంతంలో అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్షియం-ఏడీసీ(అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్) కలిసి సింగపూర్-అమరావతి ఇన్వెస్ట్ మెంట్స్ హోల్డింగ్స్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేశాయి. పెట్టుబడుల ఆకర్షణ కోసం అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ ఏడీపీ అనే ప్రత్యేక వాహక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో సింగపూర్ కన్సార్షియానికి 58 శాతం, ఏడీసీకి 42 శాతం వాటా ఉంది.
సింగపూర్ నుంచి రాకపోకలు, ఇతర నిర్వహణా ఖర్చులతో పాటు పరస్పరం అంగీకారంతో ఒప్పందం రద్దు చేసుకున్న కారణంగా సింగపూర్ కన్సార్షియానికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'రాజధానిపై గందరగోళం... రాష్ట్రాభివృద్ధిపై ప్రభావం'