పదోతరగతి పరీక్షల్లో తీసుకొచ్చిన భారీ మార్పులకు ఈ ఏడాది విద్యార్థులు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నారు. 2019-20 విద్యా సంవత్సరం మొదట్లోనే అంతర్గత మార్కులు, బిట్ పేపర్‌ను తొలగించారు. ప్రతి సబ్జెక్టులోనూ 100 మార్కులకు ప్రశ్నలే ఉండేలా మార్పు చేశారు. తాజాగా కరోనా కారణంగా 11ప్రశ్నపత్రాలను ఆరింటికి కుదించారు.
ప్రశ్నపత్రాల తగ్గింపుపై భిన్నవాదనలు
11 ప్రశ్నపత్రాలను ఆరింటికి తగ్గించాలనే డిమాండ్లు కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ విద్యార్థుల సౌలభ్యం కోసమంటూ కొనసాగించారు. 11 ప్రశ్నపత్రాల కారణంగా సెలవులతో కలిపి పక్షం పాటు పరీక్షల వాతావరణం కొనసాగి విద్యార్థులు ఒత్తిడికి గురయ్యేవారని, ఇప్పుడు ఆరుకు కుదించడం వల్ల కొంత తేలిక పడతారని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి భిన్నంగా మరికొందరు విద్యావేత్తలు వాదన వినిపిస్తున్నారు. ఒకేసారి రెండు పేపర్లు కలిపి రాయడం వల్ల పాఠ్యాంశాలన్నింటినీ గుర్తుంచుకోవాల్సి వస్తుందని.. ఇది విద్యార్థులకు ఇబ్బందికరమేనని వివరిస్తున్నారు.
సిద్ధం చేయాలి
విద్యార్థులు ఇప్పటివరకు 11 ప్రశ్నపత్రాలతోనే అంతర్గత పరీక్షలు రాశారు. సమ్మెటివ్, ప్రీఫైనల్ కూడా రాశారు. తొమ్మిదో తరగతిలోనూ ఒక్కో సబ్జెక్టుకు రెండు ప్రశ్నపత్రాల విధానంలో వెళ్లారు. ప్రస్తుతం విద్యార్థులు ఇళ్లకే పరిమితమైనందున ప్రైవేటు పాఠశాలలవారు తమ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో మార్పులకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇది మరింత పటిష్టం కావాల్సి ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
వెనుకబడిన వారి మాటేంటి?
వంద మార్కుల ప్రశ్నపత్రం వల్ల సబ్జెక్టుకు సంబంధించి అన్ని పాఠాలను ఒకేసారి పునశ్చరణ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది వెనుకబడిన విద్యార్థులకు ఇబ్బందికరమే. ఉదాహరణకు.. సామాన్య శాస్త్రానికి సంబంధించి భౌతిక రసాయన శాస్త్రంలో 12, జీవశాస్త్రంలో 10 అధ్యాయాలున్నాయి. పర్యావరణ విద్యకు సంబంధించి 29 పాఠాలుంటాయి. వీటన్నింటికి ఒకేసారి చదవడం కష్టసాధ్యమే. సామాన్యశాస్త్రం పాఠ్యాంశాలు ఎక్కువగా ఉన్నందున ఒకే రోజు వేర్వేరుగా 2 పరీక్షలు నిర్వహించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచిస్తున్నారు.
- ప్రశ్నపత్రాలు 50 మార్కులకున్నప్పుడు 4 మార్కులవి పది వ్యాసరూప ప్రశ్నలిచ్చి ఐదింటికి సమాధానం రాయమనేవారు. రెండు పేపర్లు కలిపితే 20 ప్రశ్నల్లో పదింటికి సమాధానం రాసేవారు. దీంతో సాంఘిక, గణితశాస్త్రాల్లో దాదాపు ప్రతి అధ్యాయం నుంచి ప్రశ్న వచ్చేది. ప్రస్తుత విధానంలో పది వ్యాసరూప ప్రశ్నల్లో ఐదింటిని రాయాలి. పాఠ్యాంశాలు ఎక్కువైనందున ఇది చదువులో వెనుకబడిన వారికి ఇబ్బందికరమేనన్న విశ్లేషణలున్నాయి.
ప్రశ్నలన్నే.. సమయం పెరిగింది
కొత్త విధానంలో ప్రశ్నల సంఖ్యను కాకుండా మార్కులను మాత్రమే పెంచారు. 50 మార్కులు వంద అయ్యాయి. పరీక్ష వ్యవధి లోగడ 2.45 గంటలు ఉండేది. దాన్ని అరగంట పెంచడం విద్యార్థులకు కలసివచ్చేదేనని ఒక ఉపాధ్యాయురాలు అన్నారు. ఆంగ్లంలో టెన్సెస్‌కు సంబంధించి లోగడ అర మార్కు ప్రశ్నలు 4 ఉండగా, ఇప్పుడు 2కు తగ్గించారు. ఈ మార్పు విద్యార్థికి ప్రయోజనకరమని ఆంగ్ల ఉపాధ్యాయుడు ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి: