మీ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చినందుకు అభినందనలు. టీనేజీలో ఇలాంటి కోరికలు సహజమే.. కానీ ఈ వయసులోనే కోరికలని నియంత్రించుకునే నిగ్రహ శక్తి ఉండాలి. మనసు చెప్పినట్టు మీరు వినకూడదు. మీరు చెప్పినట్టే మనసు వినేలా నియంత్రించుకోవాలి. చెడు ఆలోచనలు ఎప్పటికీ ప్రమాదకరమే. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా అనైతిక సంబంధం ఏర్పడితే ఆమె జీవితానికి కూడా ముప్పే. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు చేయడం, హత్యకు గురి కావడంలాంటి ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం.
ఆమెలో ఎలాంటి కల్మషం లేదని మీరే చెప్పారు. కాబట్టి మీ ఆలోచనా విధానం మార్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆమె మీతో చనువుగా ఉంటోంది అంటే తనని ఒక అక్కలా భావించుకోండి. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు కాకుండా ఆమె భర్త ఉన్నప్పుడే వాళ్లింటికి వెళ్లండి. ప్రస్తుతం మీరు చదువు, కెరీర్, లక్ష్యాలు, ఆర్ధికంగా ఎలా ఎదగాలి అనే విషయాలపైనే దృష్టి పెట్టాలి. బంధాలు.. అనుబంధాల పట్ల గౌరవం, నైతిక విలువలు పాటించే వారినే సమాజం గౌరవిస్తుందనే విషయం మర్చిపోవద్దు. మీకు అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఏమైనా ఉంటే మానుకోండి. ఒక్కసారి మంచీచెడుల గురించి బాగా ఆలోచిస్తే.. తప్పేంటో, ఒప్పేంటో మీ అంతరాత్మ చెబుతుంది. కాలేజీ పరీక్షల్లో ఫెయిలైతే.. మరోసారి రాసి పాస్ కావొచ్చు. జీవితం అనే పరీక్షలో ఒక్కసారి వైఫల్యం చెందితే బతికి ఉన్నంతకాలం బాధ పడాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: