2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన స్కామ్‌పై సీఐడీ కేసును వేగంగా, నిష్పక్షపాతంగా విచారించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణకు ఏపీఎస్ఎంఐడీసీ ద్వారా టెండర్లు పిలిచినట్టు వివరించారు. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియన్ టెలీమాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ అనే సంస్థకు టెండరు ఖరారు చేసినట్టు లేఖలో ప్రస్తావించారు.
ఈ టెండర్లో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండరు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్ ధరల కంటే పెంచి మోసానికి పాల్పడిందని వివరించారు. ఏడాదికి రూ.460 కోట్ల భారీ మొత్తానికి టెండర్ కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా పొడిగించారని తెలిసిందన్నారు. వెంటిలేటర్ రూ.7.10 లక్షలుంటే దాన్ని రూ.11 లక్షలుగా పెంచి 159 వెంటిలేటర్ల సరఫరా చేశారని తెలిపారు.
గ్లూకో మీటరు ధర పెంచి 12 గ్లూకో మీటర్ల కొనుగోలు చేశారని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. రూ.1.7 కోట్ల విలువ చేసే ఎమ్మారై మిషన్‌ను రూ.3.60 కోట్లుగా చూపించారని... మొత్తంగా రూ.300 కోట్లు విలువ చేసే ఉపకరణాలను రూ.500 కోట్లుగా చూపించినట్లు సమాచారం ఉందన్నారు. ఈ అవినీతిలో రూ.200 కోట్ల మేర చేతులు మారాయంటున్నారని లేఖలో తెలిపారు. దీనికి అదనంగా 2016-17, 2017-18లో నిర్వహణ వ్యయంగా మరో రూ.24,90 కోట్లు కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. సీఐడీ ఈ కేసు విచారణను వేగంగా పూర్తిచేసి దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరారు.
ఇదీ చదవండీ... మా నాన్నది రాజకీయ హత్యే: సునీతారెడ్డి