'కొవిడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రణాళిక లేకుండా లోపభూయిష్టంగా వ్యవహరించింది. రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం, ఆసుపత్రులు, పారిశుద్ధ్యం తదితరాలన్నీ రాష్ట్రాల పరిధిలోనివి. అయినా కేంద్రం బాధ్యతగా వ్యవహరించింది. సీఎం జగన్ మాత్రం ఈ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే భాజపాయేతర 11 మంది సీఎంలకు లేఖలు రాశారు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఆయన ఆదివారం విలేకర్లతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘కేంద్రం టీకా విధానంలో భాగంగా.. జూన్ 5 వరకు 25.30 కోట్ల డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించింది. 25% టీకాలను రాష్ట్రాలు కొనాల్సి ఉన్నా, ఈ ప్రభుత్వం ఒక్క టీకా కూడా కొనలేదు. మళ్లీ గ్లోబల్ టెండర్లకు వెళ్లారు. 18-45 ఏళ్లలోపు వారిలో ఇతర రాష్ట్రాల్లో లక్షల్లో టీకాలు వేస్తే.. మన రాష్ట్రంలో 60వేల కంటే తక్కువమందికే అందాయి. యువతపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద ఏంటో దీన్నిబట్టే అర్థమవుతుంది’ అని మండిపడ్డారు.
టీకాలు ఉన్నా వినియోగించలేదు
‘రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన టీకాలు జనవరిలో 10.5 లక్షల డోసులు అందుబాటులో ఉంటే, వాటిలో 1.90 లక్షలే ఉపయోగించుకున్నారు. ఫిబ్రవరిలో 24.6 లక్షలకు గాను 4.8 లక్షలు, మార్చిలో 30.40 లక్షలకుగాను 19.4 లక్షలే వినియోగించారు. ఈ సీఎం నిజాయితీకి ఇది మచ్చుతునక. ఆక్సిజన్ కూడా సరిగా వినియోగించలేదు. కడపలో ప్రైవేటు ఆక్సిజన్ వినియోగ సంస్థల వద్ద 700 సిలిండర్లు ఉన్నాయని అక్కడి భాజపా నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకొస్తే, అప్పుడు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో తొలుత 13 మంది చనిపోయారన్నారు. తర్వాత 23 మందికి డబ్బులిచ్చారు. ఈ సీఎం అన్ని పార్టీలతో కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకోలేదు’ అని వీర్రాజు విమర్శించారు..
వైకాపా ఎంపీ టీకాలు వృథా అన్నారు
‘రాహుల్‌గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు, వామపక్షాలు టీకాలు వృథా అన్నాయి. కర్నూలులో పెద్ద ఆసుపత్రి ఉన్న వైకాపాకు చెందిన ఓ ఎంపీ కూడా టీకాల పేరిట రూ.35వేల కోట్ల నిధులు వృథా చేస్తున్నారని లోక్‌సభ చర్చలో పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు వాళ్ల సీఎం ఆరోపణలు సజావుగా లేవు. పీఎం కేర్స్ నిధులతో ఏప్రిల్ 6న రాష్ట్రానికి 4,960 వెంటిలేటర్లను కేంద్రం ఇచ్చింది. అనేకచోట్ల ఇవి ఉపయోగించకుండా పడి ఉన్నాయి. రాష్ట్రానికి ఎన్95 మాస్క్‌లు 15.63 లక్షలు, పీపీఈ కిట్లు 3.19 లక్షలు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు 3.67 లక్షలు ఇచ్చారు. మే 11 నుంచి 27 వరకు 12,230 బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లు ఇచ్చారు. భారత్ బయోటెక్ నెలకు కోటి డోసులు ఉత్పత్తి చేస్తుండగా, వాటిని 10 కోట్లకు పెంచేలా, సీరం ఇన్‌స్టిట్యూట్ 11 కోట్లు డోసులు తయారు చేసేలా కేంద్రం సహకరిస్తోంది’ అని సోము వీర్రాజు తెలిపారు.
భాజపా నిరసన దీక్ష రేపు
పంటలకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఏవీఎస్ సూర్యనారాయణరాజు తెలిపారు. ‘ఆంధ్ర రైతులకు న్యాయం కోసం’ పేరుతో దీక్ష చేపట్టనున్నట్లు ఆదివారం ట్వీట్ చేశారు.
ఇదీ చదవండీ... Jagan Delhi Tour: సీఎం జగన్ దిల్లీ పర్యటన వాయిదా