దేశంలో రాష్ట్రాలన్నీ పెట్రోలు ధరలు తగ్గిస్తుంటే.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మాత్రం మొండిగా వాదిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ధరలు తగ్గించాలని కోరితే.. మంత్రులు ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ధరలు తగ్గించి ఉపశమనం కలిగించినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించదని నిలదీశారు.
'పెట్రోల్ ధరలు తగ్గించబోమని ప్రజలను కొడతారా? ఎయిడెడ్ విద్యా సంస్థల పిల్లలను కొట్టినట్లు కొడతారా? ప్రజలకు ఉపశమనం చేయాలని కోరితే రాద్ధాంతం చేస్తారా? ప్రకటనలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రకటనల విషయమై సీఎం, సీఎస్‌కు లేఖ రాస్తున్నాం. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువున్నాయి' - సోము వీర్రాజు
చీప్ లిక్కర్ దోపిడీ
రూ.25 ఉండే చీప్ లిక్కర్‌ను రూ.250కు అమ్ముతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. చీప్ లిక్కర్ రేట్ల దోపిడీపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలతో సహా చర్చకు భాజపా సిద్ధమని సవాల్ విసిరారు. భాజపా ఎవరికీ తోక పార్టీ కాదని అన్నారు. జనసేనతో తప్ప ఎవరితోనూ పొత్తు అవసరం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: