ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న మహమ్మారి కరోనా... మానవాళి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అయితే ఎన్ని ఆంక్షలు ఉన్నా.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొంతమంది నిర్లక్ష్యంతో రోడ్డెక్కుతున్నారు. కొందరిది అవగాహన లోపమైతే.. మరికొందరిది బాధ్యతా రాహిత్యంగా కనిపిస్తోంది. దీని వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది.
లాక్డౌన్ ఉన్నా.. మన్యంలో జన జాతర
కరోనా దృష్ట్యా ప్రభుత్వం లాక్డౌన్ విధించినా విశాఖ ఏజెన్సీ మారుమూల జి.మాడుగుల మండలం మద్దిగరువు కొండలపై గుహలో రాస కొండమ్మ జాతర జరిగింది. అవగాహన లోపం వల్ల వందలాది మంది జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిబంధనలు ఉన్నాయని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గ్రామీణుల స్వీయ నిర్బంధం
మరోవైపు లాక్డౌన్ అమలును కొన్ని గ్రామాలు కచ్చితంగా పాటిస్తున్నాయి. ఎవరూ తమ గ్రామాల్లోకి రావొద్దంటూ గ్రామ సరిహద్దుల్లో ఆ ప్రాంత వాసులు కంచె వేస్తున్నారు. గ్రామంలోని వారు బయటకు వెళ్లకుండా చూస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పట్టణాల్లో పరిమితంగానే
అదే పట్టణాల విషయానికి వచ్చేసరికి కొన్ని చోట్ల మాత్రమే ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నిత్యావసరాల కోసమని.. ఇతర కారణాలతో బయటకు వస్తున్నారు. దీని వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టాలన్న సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తే వైరస్ను సమర్థంగా పారద్రోలే అవకాశం ఉంటుంది.
ఇదీ చూడండి: