దేశంలోని ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో ఆరు రాష్ట్రాల్లోని 100 గ్రామాలకు సెన్సర్ ఆధారంగా తాగునీరు అందించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది. జాతీయ జల్‌జీవన్ మిషన్ కింద ఏపీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మణిపుర్‌లలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లకు బదిలీ చేసి ఆ గ్రామవాసులకు సరఫరా చేసిన నీటి నాణ్యత, పరిమాణం, ఎన్ని రోజులకు ఓసారి సరఫరా చేశారన్న విషయాలను విశ్లేషిస్తారు.
ఈ ప్రక్రియ వల్ల.. సేవల్లో ఉన్న లోపాలను, డిమాండ్‌ను, నీటి లీకేజీలను, నాణ్యతను పరిశీలించడానికి వీలవుతుందని జల్‌శక్తి శాఖ పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం అందే నిధులను పంచాయతీరాజ్ సంస్థలు తాగునీరు, పారిశుద్ధ్యం కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. అందువల్ల అవి సరఫరా చేసే నీటిని కొలవడానికి ఆటోమేటెడ్ వ్యవస్థ అవసరమని జల్‌శక్తి శాఖ తెలిపింది. ఇందుకోసమే ఇప్పుడు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖతో కలిసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:
మెజిస్ట్రేట్ ఉత్తర్వులనూ పట్టించుకోరా.. సీఐడీపై హైకోర్టు ఆగ్రహం