PROBATION: లక్ష మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను జూన్ నెలాఖరులోగా ఖరారు చేస్తామన్న అధికారుల మాటలు అమలుకు నోచుకోలేదు. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకు 69,328 ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారైంది. జులై నెల మొదలై వారమైనా మిగిలిన 30,672 మంది ప్రొబేషన్ ఖరారులో ఎందుకు జాప్యమవుతుందో అధికారుల వద్ద సమాధానం లేదు. రెండేళ్ల సర్వీసు పూర్తయి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన, ఎలాంటి అభియోగాల్లేని ఉద్యోగుల ప్రొబేషన్ గత నెలాఖరులోగా ఖరారు చేసి జులై నుంచి కొత్త వేతనం అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని జిల్లాలనుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 1.22 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు లక్ష మంది ప్రొబేషన్ జూన్ నెలాఖరులోగా ఖరారుచేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. మిగిలినవారిలో రెండేళ్ల సర్వీసు, శాఖాపరమైన పరీక్షల్లో ఎప్పుడు ఉత్తీర్ణులైతే అప్పుడు ప్రొబేషన్ ఖరారు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటివరకు అత్యల్పంగా 600 మంది ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేశారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 7,921 మంది ప్రొబేషన్ ఖరారైనట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు గురువారం ఇచ్చిన నివేదికలో అధికారులు వివరించారు.
రెండోసారి పంపిన ఉద్యోగుల జాబితాలతో గందరగోళం
ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారులో ప్రధానంగా 4 అంశాలను కలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ మొదట సూచించింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన, ఉద్యోగంలో చేరకముందు ఎలాంటి పోలీసు కేసులు లేని, రెండేళ్లలో క్రమశిక్షణ చర్యల కోసం ఎలాంటి ఉత్తర్వులు పెండింగ్‌లో లేని వారందరి ప్రొబేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈలోగా మళ్లీ.. ప్రొబేషన్ ఖరారులో జాప్యంపై జనవరిలో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న, సచివాలయాలశాఖ వాట్సాప్ గ్రూపు నుంచి బయటకెళ్లిన వారందరి జాబితాలు కలెక్టర్లకు పంపడంతో గందరగోళం ఏర్పడింది. ముందొచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొబేషన్ ఖరారు చేయాలా? తరువాత పంపిన జాబితాలో పేర్లున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ను నిలిపేయాలా? అనే విషయంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల అధిపతులు తేల్చుకోలేక ఈ ప్రక్రియను కొనసాగదీస్తున్నారు. ఫలితంగా తూర్పు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలు ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారులో వెనకబడ్డాయి.
పాత జిల్లాల యూనిట్‌గా ప్రొబేషన్ ఖరారు చేసిన సచివాలయాల ఉద్యోగుల వివరాలు
ఇవీ చదవండి: