Kandukuri House Damaged : కందుకూరి వీరేశలింగం పంతులు ఓ సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, సాహతీవేత్త, స్త్రీ జనోద్ధరణ కోసం జీవితాన్ని అర్పించిన త్యాగధనుడు. ఆ మహనీయుడు జన్మించి, నివసించిన గృహం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఎటుచూసినా చెదలు పట్టిన దూలాలు, బీటలు వారిన గోడలే. కనీస నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తోంది. భావితరాలకు భద్రంగా అందించాల్సిన రాజమహేంద్రవరంలోని కందుకూరి జన్మగృహం ప్రస్తుతం నిర్లక్ష్యపు చెదలు పట్టి మసకబారుతోంది.
మూఢనమ్మకాలు, అనాగరిక చర్యలు, కట్టుబాట్లు ఎదిరించి మహిళల జీవితాల్లో వెలుగు నింపిన స్ఫూర్తి ప్రదాత కందుకూరి వీరేశలింగం పంతులు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తాను నమ్మిన ఆశయం కోసం జీవితాన్నే అర్పించిన ఆ మహనీయుడు నడయాడిన ఇల్లు నేడు మసకబారుతోంది. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డు వంకాయల వారి వీధిలోని ఇంట్లో 1848 ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జన్మించారు.
తన జీవిత కాలంలో సుమారు పదేళ్లు మినహా మిగిలిన సమయమంతా ఇదే ఇంట్లో కందుకూరి వీరేశలింగం నివాసమున్నారు. 1881లో తాను జన్మించిన ఈ గృహంలోనే ఆయన తొలి వితంతు వివాహం జరిపించారు. అది ఆనాటి సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలకు పూర్తి విరుద్ధం. యావత్ సమాజం తీవ్రంగా వ్యతిరేకించినా ధైర్యంగా ఎదుర్కొని మహిళాభ్యుదయం కోసం పాటుపడిన మహా మనిషి కందుకూరి వీరేశలింగం పంతులు. అంతటి మహనీయుడు నివసించిన గృహం ప్రస్తుతం చెద పురుగులకు ఆవాసమైంది. దూలాలు చెదలు తినేయడంతో పాడైపోయాయి. గోడలు బీటలు వారాయి. పై అంతస్తులో పెంకులు ఊడిపోయి వర్షపునీరు కారుతోంది.
"అజ్ఞానంతో ఉన్న ప్రజలు చైతన్యవంతులు కావాలని వీరేశలింగం అధ్బుతమైన రచననలు చేశారు. ఆయన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. వీరేశలింగం నడియాడిన ప్రాంతాలను కళావిహీనంగా మారాయి. వాటిని పరిరక్షించుకోవాలని అవసరైనా ఎంతైనా ఉంది. వాటిని సంరక్షించి భావితరాలకు అందించాలి." - సంజీవరావు, కందుకూరిపై పరిశోధనలు చేసిన వ్యక్తి
Negligence in Kandukuri House : కందుకూరి తన రచనలు ముద్రించేందుకు వినియోగించిన యంత్రం, ఆయన వాడిన లాంతరు, ధరించిన దుస్తులు, బ్రిటీష్ వారు రావుబహదూర్ బిరుదు ప్రదానం చేసిన సమయంలో ఆయన వినియోగించిన కోటు, కుర్చీ, చేతికర్ర, ఆయన స్వ దస్తూరితో రాసిన అనేక లేఖలు ఈ గృహంలోనే పొందుపరిచారు. అలాగే కందుకూరి స్వయంగా రాసిన అనేక గ్రంథాలు ఇక్కడే ఉన్నాయి. వీటిని జాగ్రత్త పరిచేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. కందుకూరి జీవితం భావితరాలకు అందించేందుకు1990లో ఈ గృహాన్ని పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా గుర్తించి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి పురావస్తు శాఖ ఆధీనంలోనే కందుకూరి జన్మగృహం నిర్వహణ కొనసాగుతోంది.
శుక్రవారం మినహా రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులను కందుకూరి జన్మగృహ సందర్శనకు అనుమతిస్తారు. అయితే ప్రస్తుతం నిర్వహణ లోపంతో దెబ్బతిన్న ఇల్లు సందర్శకులు తిలకించేందుకు అనుకూలంగా లేదు. చివరి సారిగా గత పుష్కరాల సమయంలో ఈ ఇంటికి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోకపోవడంతో ఇలా శిథిలావస్థకు చేరింది.
కందుకూరి వీరేశలింగం.. హితకారిణి సమాజం భూములపైన సర్కారు కన్ను!