ED raids in Musaddilal Gems and Jewellery: ప్రభుత్వరంగ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్‌ను మోసగించారన్న ఆరోపణలపై ఎంబీఎస్ గ్రూపు సంస్థల అధినేత సుఖేష్ గుప్తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఎంఎంటీసీ నుంచి కొనుగోలుదారుల క్రెడిట్ పథకం కింద బంగారం కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై.. సుఖేష్ గుప్తాతో పాటు అతడి సంస్థలపై 2013లో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆ కేసు ఆధారంగా రెండు రోజులుగా సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు గత రాత్రి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఎంఎంటీసీలోని కొందరు అధికారులతో కుమ్మక్కైన సుఖేష్ గుప్తా తగినంత సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించకపోవడమే కాకుండా.. ఫారెక్స్ కవర్ లేకుండానే భారీ ఎత్తున బంగారాన్ని తెచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారానికి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయకపోయినా కొందరు అధికారుల సహకారంతో.. సంస్థ ప్రధాన కార్యాలయానికి తప్పుడు వివరాలు సమర్పించారని దర్యాప్తులో తేలింది.
ఎంఎంటీసీకి రూ.504.34 కోట్ల బకాయి: అయితే వారి నిర్వాకం బహిర్గతమయ్యే నాటికే ఎంఎంటీసీకి పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్లు వాటిల్లింది. గత మే నాటికి వడ్డీతో కలిపి ఎంఎంటీసీకి సుఖేష్ గుప్తా సంస్థలు రూ.504.34 కోట్లు బకాయిపడినట్లు అధికారులు తేల్చారు. సంస్థల లావాదేవీలను ఎక్కువగా చేసి చూపడం ద్వారా సుఖేష్ గుప్తా ఆ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అంతేకాకుండా కొనుగోలుదారుల క్రెడిట్ పథకం ద్వారా సేకరించిన బంగారాన్ని అక్రమంగా విక్రయించడం ద్వారా.. భారీ ఎత్తున లాభాలు గడించి వ్యక్తిగత ఆస్తులను సమకూర్చుకున్నట్లు గుర్తించిన సీబీఐ 2014లోనే అభియోగపత్రం దాఖలు చేసింది.
ఈ క్రమంలో మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడీ ఎంబీఎస్ జ్యుయెలర్స్, ఎంబీఎస్ ఇంప్లెక్స్ సంస్థల నిర్వాహకులు సుఖేష్ గుప్తా, అనురాగుప్తా, నీతూగుప్తా, వందన గుప్తాకు చెందిన రూ.363.51 కోట్ల విలువైన 45 స్థిరాస్తుల్ని గతేడాది ఆగస్టులో జప్తు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తునకు నిందితులు సహకరించకపోవడమే కాకుండా తగిన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారు.
ఫెమా చట్టం కింద కేసు నమోదు: విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం- ఫెమా కింద నమోదు చేసిన మరో కేసులోనూ ఎంబీఎస్ సంస్థలపై గతంలో ఈడీ రూ.222 కోట్ల జరిమానా విధించింది . ఈ నేపథ్యంలో ఎంఎంటీసీని మోసగించిన సొమ్మును చెల్లించేందుకు నిర్వాహకులు 2019 లో వన్‌టైమ్ సెటిల్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే నిధులు జమచేయకపోవడంతో ఓటీఎస్‌లో విఫలమైనట్లు ఎంఎంటీసీ గతేడాది స్పష్టం చేసింది.
ఆ వ్యవహారంపై మరోసారి దృష్టిసారించిన ఈడీ: ఆ నివేదిక ఆధారంగా ఎంబీఎస్ వ్యవహారంపై మరోసారి దృష్టిసారించిన ఈడీ గతేడాది ఆస్తులను జప్తు చేయడం సహా రెండు రోజులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఆ సోదాల్లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన బంగారంతో పాటు, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలు, కీలకమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: