కరోనా ప్రభావంతో వచ్చే విద్యా సంవత్సరంలో అసాధారణ మార్పులు వచ్చే అవకాశం ఉంది. అన్ లైన్లో బోధనలు, తరగతి గదులలో భౌతిక దూరం ఇలా ఎన్నో మార్పులు జరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యక్తిగత దూరం ఎలా?
తరగతి గది, వసతి గృహాల్లో విద్యార్థుల మధ్య వ్యక్తిగత దూరం పాటించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒక్కో తరగతి గదిలో 30-45వరకు విద్యార్థులు ఉంటున్నారు. జూనియర్ కళాశాలలకు వచ్చే సరికి 50-80, ఉన్నత విద్యా సంస్థల్లో 60మందికిపైనే ఉంటున్నారు. విద్యార్థుల మధ్య దూరం పాటించాల్సి వస్తే ప్రస్తుత మౌలికసదుపాయాలు సరిపోవు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆన్‌లైన్, విడతల వారీ తరగతులే పరిష్కారమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ఆన్‌లైన్లో సాధ్యమా?
విద్యార్థులందరూ ఒకేతరగతి గదిలో పాఠాలు వినడం సాధ్యం కాకపోవచ్చు. ఎక్కువ విద్యా సంస్థలు ఆన్‌లైన్‌కే ప్రాధాన్యం ఇస్తాయి. ఇప్పటికే కొన్ని ఈ బాట నడిచాయి. ఇంతవరకు నేరుగా పాఠాలు విన్న విద్యార్థులు ఆన్‌లైన్‌కు అలవాటు పడాల్సి ఉంటుంది. ఉన్నత విద్య వరకు బాగానే ఉన్నా, పాఠశాల స్థాయిలో కష్టంగా మారవచ్చంటున్నారు నిపుణులు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాలు కొరతతో ఇబ్బందులు తప్పవు.
మరి మార్గాలేమిటి?
విడత(షిఫ్టులు)ల వారీగా తరగతులు నిర్వహించడం ద్వారా నేరుగా పాఠాలు బోధించేందుకు అవకాశం ఉంటుంది. ఉదయం కొన్ని తరగతులు, సెక్షన్లకు, మధ్యాహ్నం నుంచి మరి కొంతమందికి తరగతులు నిర్వహించవచ్చు. ఒక తరగతిలో నేరుగా ఉపాధ్యాయుడితో బోధిస్తూ మరో తరగతిలో తెరపై ప్రదర్శనలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు: 62,414
ప్రైవేటు బడులు: 17,231
ఈ విధానాలు మేలు
* విద్యా సంస్థల్లో షిఫ్టు విధానం అమలు కొంత మేలు చేస్తుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అమెరికాలోగా ఒక సెమిస్టర్‌కు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవచ్చన్నారు. తరగతి గదిలో వ్యక్తిగత దూరం పాటించినా వసతి గృహాల్లో అమలు చేయడం కష్టమన్నారు.
* ఆన్‌లైన్ తరగతులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వమే ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తే ఉపయుక్తమని ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.